CM KCR: కేంద్రానిది చిల్లర వ్యవహారం

పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత... రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. రాజీవ్‌గాంధీ నుంచి నేటి ప్రధాని వరకు ఇదే తీరును అనుసరించడం సరికాదన్నారు. జవహర్‌ రోజ్‌గార్‌ యోజన, గ్రామ్‌సడక్‌ యోజన, నరేగా వంటి పథకాలను దిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు. పల్లె, పట్టణ ప్రగతి సహా..బృహత్‌ పల్లె ప్రకృతి వనాల అభివృద్ధిపై బుధవారం...

Updated : 19 May 2022 05:12 IST

దిల్లీ నుంచి పథకాలు అమలు చేస్తామనడం సమర్థనీయం కాదు
నేరుగా గ్రామాలకు నిధులివ్వడమేమిటని ప్రశ్న
ఇది రాష్ట్రాలను కించపరచడమేనని వ్యాఖ్య
జూన్‌ 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి  
ఊరూరా క్రీడా ప్రాంగణాలు
పల్లె, పట్టణ ప్రగతి సమీక్షలో  కేసీఆర్‌  
ఈనాడు - హైదరాబాద్‌

దేశంలో విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో రావాల్సినంత ప్రగతి రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా, రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం అర్థరహితం.


75 సంవత్సరాల అమృత్‌ మహోత్సవాల సందర్భంలోనూ దేశంలోని కొన్ని పల్లెలు, పట్టణాలు కరెంటు లేక చీకట్లలో మగ్గుతున్నాయి. తాగు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ సమస్యలు కేంద్రానికి పట్టవా? 

- సీఎం కేసీఆర్‌

పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత... రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. రాజీవ్‌గాంధీ నుంచి నేటి ప్రధాని వరకు ఇదే తీరును అనుసరించడం సరికాదన్నారు. జవహర్‌ రోజ్‌గార్‌ యోజన, గ్రామ్‌సడక్‌ యోజన, నరేగా వంటి పథకాలను దిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు. పల్లె, పట్టణ ప్రగతి సహా..బృహత్‌ పల్లె ప్రకృతి వనాల అభివృద్ధిపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష  సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల్లో నెలకొన్న స్థానిక పరిస్థితులు అక్కడి ప్రభుత్వాలకే తెలుస్తాయని, రోజువారీ కూలీల డబ్బులు కూడా దిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానం కాదని ఆక్షేపించారు.  పల్లెలు, పట్టణాలతో పాటు అన్ని రంగాల్లో అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించామన్న సీఎం... ఇందులో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. అడవులను పునరుజ్జీవింప చేయడం ద్వారా కోల్పోయిన స్వర్గాన్ని మళ్లీ తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఎండల నేపథ్యంలో...రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. జూన్‌ 3 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసిఆర్‌ ఆదేశించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..  

దేశం గర్వించే స్థాయిలో పల్లెలు

‘ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను బాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తోంది. నేడు దేశం గర్వించే స్థాయిలో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నాం.రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల పురస్కారాలు దాదాపు రాష్ట్రానికే రావడం హర్షణీయం. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రికి అభినందనలు. ఫలితాలు ఊరికే రావు. ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు...అమలవుతున్న కార్యాచరణతో పాటు అధికారులు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే సాధ్యమవుతాయి. అన్ని రంగాల్లో జరిగిన రాష్ట్ర అభివృద్ధిని ఇటీవల కొన్ని జాతీయ మీడియా ఛానళ్లు ప్రసారం చేశాయి. ఇది చూసిన ఇతర రాష్ట్రాల వారికి ఆశ్చర్యం కలిగింది. రాష్ట్ర అభివృద్ధి గురించి ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇక్కడి పథకాలను రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ప్రజలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాయచూర్‌ భాజపా ఎమ్మెల్యే తెలంగాణ పథకాలను కర్ణాటకలో అమలు చేయాలని, లేకపోతే తమ ప్రాంతాన్ని తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారు.

జడ్పీ ఛైర్‌పర్సన్లది కీలకపాత్ర

పంచాయతీరాజ్‌లో జడ్పీ ఛైర్‌పర్సన్లది కీలకపాత్ర. పల్లెప్రగతిలోనూ వారు ప్రధాన భూమిక పోషించాలి. ఎంపీపీలు, ఎంపీడీవోల సేవలను ఉపయోగించుకోవాలి. పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా స్థానిక సంస్థలు ఉన్నత స్థితి నుంచి అత్యున్నత స్థితికి చేరాలి. వందశాతం వైకుంఠధామాలు పూర్తికావాలి. జడ్పీ ఛైర్‌పర్సన్లు నిరంతరం తనిఖీ చేయాలి. గ్రామాలు, పట్టణాలు బహిరంగ మల విసర్జన రహితం కావాలి.

దశలవారీగా దళితబంధు

ఈ ఏడాది నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగించాలి. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత దశల వారీగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలి.  

అన్నిటా అగ్రభాగాన రాష్ట్రం

పంటల ఉత్పత్తిలో, తలసరి ఆదాయంలో ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల కంటే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రంలో మొత్తం 10 వేల పడకల సామర్థ్యంతో ఆరు కొత్త మల్టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలను నిర్మించుకోనున్నాం. వరంగల్‌లో 24 అంతస్తుల్లో 38 విభాగాలతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నాం. అల్వాల్‌, సనత్‌నగర్‌, గడ్డి అన్నారం, గచ్చిబౌలి టిమ్స్‌లలో ఢిల్లీ ఎయిమ్స్‌ తరహాలో సౌకర్యాలు కల్పించబోతున్నాం. మొట్టమొదటి సారి ప్రపంచానికి హరితనిధిని తెలంగాణ పరిచయం చేసింది. మహబూబ్‌నగర్‌లో 2,087 ఎకరాల్లో అద్భుతంగా నిర్మించిన పార్కును ఆదర్శంగా తీసుకొని, ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలి. ఓఆర్‌ఆర్‌పై పచ్చదనం కోసం శ్రద్ధ తీసుకోవాలి. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీ వైకుంఠధామానికి 10 రోజుల్లోగా మిషన్‌ భగీరథ కనెక్షన్‌ అందించాలి.పురపాలక వార్డుల్లో నర్సరీలు ఏర్పాటు చేయకపోతే, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు

భవిష్యత్తు తరాలు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేస్తున్నాం. 19 వేల గ్రామాలు, 5వేల వార్డులు, మొత్తంగా 24 వేల ‘‘గ్రామీణ క్రీడా కమిటీ’లను ఏర్పాటు చేయాలి. ఇవి క్రీడల నిర్వహణ కోసం పనిచేయాలి’’ అని సీఎం తెలిపారు. సమావేశంలో మంత్రులు, మేయర్లు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సంబంధిత శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు పాల్గొన్నారు.


పబ్లిక్‌గార్డెన్స్‌లో రాష్ట్రావతరణ వేడుకలు : సీఎం

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎప్పటి మాదిరిగానే నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం బుధవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొనాలని సీఎం సూచించారు. సాయంత్రం వేళ హైదరాబాద్‌ రవీంద్రభారతిలో, జిల్లా కేంద్రాల్లో కవి సమ్మేళనాలు నిర్వహించాలన్నారు.


తడిసిన ధాన్యాన్ని కొంటాం

- సీఎం కేసీఆర్‌

డిసిన ధాన్యాన్ని ఎంత ఖర్చయినా రాష్ట్ర ప్రభుత్వమే భరించి చివరి గింజ వరకు కొంటుంది. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు. మొత్తం 56 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకున్నాం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని