Published : 19 May 2022 04:40 IST

ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న తెలంగాణ

పెట్టుబడులకు స్వర్గధామం మా రాష్ట్రం
బ్రిటన్‌ పారిశ్రామికవేత్తలు తరలి రావాలి
యూకేఐబీసీ సదస్సులో మంత్రి కేటీఆర్‌ పలు సంస్థల ప్రతినిధులతో భేటీ
ఈనాడు - హైదరాబాద్‌

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని, బ్రిటన్‌తో పాటు ప్రపంచ దేశాలన్నీ తమ సంస్థలను ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వ అనుకూల విధానాలు, అత్యున్నత మౌలిక సదుపాయాలు, మానవ వనరుల లభ్యత తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్నాయని, బ్రిటన్‌ పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున రాష్ట్రానికి తరలి రావాలని కోరారు. భారతదేశం కోణం నుంచి మాత్రమే తెలంగాణను చూడొద్దని, తమ రాష్ట్రంలోని వినూత్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. విదేశీ పర్యటనలో భాగంగా బుధవారం లండన్‌ చేరుకున్న ఆయన బ్రిటన్‌, భారత్‌ వాణిజ్యమండలి (యూకేఐబీసీ) ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సదస్సులో ప్రసంగించారు. ‘తెలంగాణ భారత్‌లో అతి చిన్న వయసు గల రాష్ట్రం. అనతికాలంలోనే ప్రపంచవ్యాప్త ఖ్యాతి పొందింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అత్యున్నతమైన టీఎస్‌ఐపాస్‌ వంటి విధానాలను తెచ్చింది. పారిశ్రామిక రంగానికి అవసరమైన నిరంతర విద్యుత్‌, సత్వర అనుమతులు, పారదర్శకత, భూకేటాయింపులు, ప్రోత్సాహకాలు, మార్కెటింగ్‌, ఎగుమతులకు సహకారం వంటి చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడుతోంది. రాష్ట్రం ఐటీ, ఔషధ, ఆహారశుద్ధి, వైమానిక, రక్షణ, బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవహారాల వంటి కీలక రంగాల్లో పురోగమిస్తోంది. హైదరాబాద్‌ ప్రపంచస్థాయి నగరంగా గుర్తింపు పొందింది. దేశంలో అసలు సిసలైన కాస్మోపాలిటన్‌ సంస్కృతి హైదరాబాద్‌లో మాత్రమే ఉంది. అనేక దశాబ్దాలుగా భారత్‌, బ్రిటన్‌ల మైత్రి కొనసాగుతోంది. బలమైన వాణిజ్య సంబంధాల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలి’ అని కోరారు. డెలాయిట్‌, హెచ్‌ఎస్‌బీసీ, జేసీబీ, రోల్స్‌ రాయిస్‌ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ సమావేశాల్లో కేటీఆర్‌ వెంట పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, అధికార ప్రతినిధులు ఉన్నారు.

బ్రిటన్‌ వాణిజ్యమంత్రితో భేటీ

బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి రణిల్‌ జయవర్దనేతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రంగంలో ప్రాధాన్యాలు, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బయో ఏసియా సదస్సులో పాల్గొనాల్సిందిగా జయవర్దనేను కేటీఆర్‌ ఆహ్వానించారు. తమ దేశ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నారని జయవర్దనే తెలిపారు.  

లండన్‌లో ఘన స్వాగతం

అంతకుముందు లండన్‌ విమానాశ్రయంలో కేటీఆర్‌కు బ్రిటన్‌ తెరాస ప్రవాస విభాగం, పలు ఎన్‌ఆర్‌ఐ సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ సైతం మంత్రికి స్వాగతం పలికారు.


సర్ఫేస్‌ మెజర్‌మెంట్స్‌ రూ. 100 కోట్ల పెట్టుబడులు
లండన్‌లో మంత్రి కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ సర్ఫేస్‌ మెజర్‌మెంట్‌ సిస్టమ్స్‌ తెలంగాణలో రూ. 100 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఔషధ పొడి (ఫార్మా ఫౌడర్‌) పరీక్ష, విశ్లేషణ ప్రయోగశాలను ఏర్పాటు చేయనుంది. ఏడువేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ప్రయోగశాల ద్వారా వెయ్యి మందికి ఉపాధి కల్పించనుంది. లండన్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్‌ను సర్ఫేస్‌ సంస్థ ఎండీ డెరిల్‌ విలియమ్స్‌, అంతర్జాతీయ సేల్స్‌ మేనేజర్‌ డేనియల్‌ విలాలబస్‌, భారత కార్యకలాపాల విభాగాధిపతి సయ్యద్‌ ఖుతుబుద్దీన్‌లు కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. తమ సంస్థ బ్రిటన్‌తో పాటు జర్మనీ, చైనా, అమెరికాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ప్రయోగశాల భారత్‌లోనే మొదటిదని తెలిపారు. సంస్థ నిర్ణయాన్ని కేటీఆర్‌ స్వాగతించారు. ఔషధ పొడి విశ్లేషణ ప్రయోగశాల తెలంగాణలో ఔషధరంగ అభివృద్ధికి ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని