తెలుగు మాధ్యమం ప్రశ్నల ముద్రణే మరిచారు

పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీలో చిత్రవిచిత్రాల తప్పులు చేసిన ఇంటర్‌ బోర్డు తాజాగా మరో ఘోర తప్పిదానికి పాల్పడింది. ఏకంగా తెలుగు మాధ్యమంలో ప్రశ్నలనే ముద్రించకుండా విద్యార్థులను అయోమయానికి గురిచేసింది.

Published : 19 May 2022 06:56 IST

ఇంటర్‌ ఒకేషనల్‌  బ్రిడ్జి కోర్సు పరీక్షల్లో విచిత్రం
ముద్రణదారు పొరపాటని  చేతులు దులుపుకొన్న ఇంటర్‌బోర్డు

ఈనాడు, హైదరాబాద్‌: పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీలో చిత్రవిచిత్రాల తప్పులు చేసిన ఇంటర్‌ బోర్డు తాజాగా మరో ఘోర తప్పిదానికి పాల్పడింది. ఏకంగా తెలుగు మాధ్యమంలో ప్రశ్నలనే ముద్రించకుండా విద్యార్థులను అయోమయానికి గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం రసాయనశాస్త్రం, కామర్స్‌తోపాటు ఒకేషనల్‌ విద్యార్థులకు గణితం, జీవశాస్త్రం(వృక్ష, జంతు) బ్రిడ్జి కోర్సు పరీక్షలు జరిగాయి. ఒకేషనల్‌ విద్యార్థులకు ఏటా ప్రశ్నపత్రంలో ప్రతి ప్రశ్నను ఆంగ్లంతోపాటు తెలుగులో కూడా ముద్రిస్తారు. అయితే ఈసారి కేవలం ఆంగ్లంలోనే ఇచ్చారు. దీంతో ప్రశ్నలు అర్థం కాక వేలాది మంది తలపట్టుకూర్చున్నారని పలువురు అధ్యాపకులు తెలిపారు. ఒకేషనల్‌ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రాయాలంటే గణితం బ్రిడ్జి కోర్సు పరీక్ష పాస్‌ కావాలి. అదే ఎంసెట్‌ అగ్రికల్చర్‌ లేదా నీట్‌ రాయాలంటే జీవశాస్త్రం పరీక్షలో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. అంతటి కీలకమైన పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలను ఇంటర్‌బోర్డు ముద్రణకు ఇచ్చే ముందు ఏమాత్రం పరిశీలించకుండా నిర్లక్ష్యం వహించింది.

అనువదించి చెప్పాలని కోరాం..

ప్రశ్నపత్రాల ముద్రణదారు చేసిన పొరపాటు కారణంగా ప్రశ్నపత్రంలో తెలుగు వెర్షన్‌ లేకుండా పోయింది. ఈ విషయాన్ని ఉదయం 8.45 గంటలకు గుర్తించి అన్నీ తెలుగులోకి అనువదించి చెప్పాలని బ్రిడ్జి కోర్సు విద్యార్థులున్న పరీక్షా కేంద్రాలకు సమాచారం ఇచ్చామని ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

తప్పులు దిద్దుకోవడమే సరిపోయింది

బ్రిడ్జి కోర్సు పరిస్థితి అలాగుంటే ప్రథమ ఇంటర్‌ రసాయనశాస్త్రం, కామర్స్‌ ప్రశ్నపత్రాల్లోనూ పలు తప్పులు దొర్లాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో మొత్తం తొమ్మిది ఎరాటాలు(తప్పుల సవరణ) వచ్చాయి. ప్రశ్నల్లో ఉన్న తప్పులను దిద్దుకోవాలని ఇంటర్‌బోర్డు సెల్‌ఫోన్ల ద్వారా అధికారులకు సందేశాలు పంపించడం...వాటిని ఇన్విజిలేటర్లు చెప్పడంతో విద్యార్థులకు సమయం వృథా అవుతోంది. దానికితోడు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల వారు ఒకే గదిలో పరీక్షలు రాస్తుంటారు. దానివల్ల ఒక మాధ్యమం వారికి చెబుతుంటే ఇతర మాధ్యమాల వారికి ఏకాగ్రత దెబ్బతింటోందని అధ్యాపకులు చెబుతున్నారు. అంతేకాకుండా సరిదిద్దుకోవాలని మొదట ఒకటి పంపి...తర్వాత మరొకటి పంపడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.


ఇది విద్యార్థులతో చెలగాటమే
- మాచర్ల రామకృష్ణాగౌడ్‌, కన్వీనర్‌, తెలంగాణ ఇంటర్‌ విద్య పరిరక్షణ సమితి

నిత్యం తప్పుల తడకగా ప్రశ్నపత్రాలను ఇస్తుండటం విద్యార్థులతో చెలగాటం ఆడటమే. అందుకే బోర్డు కార్యదర్శిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తప్పులతో కూడిన ప్రశ్నలను చూసి విద్యార్థులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని