Telangana News: ప్రాణాధారం.. అయినా పక్కన పడేస్తాం

ఇది భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో రెండేళ్లుగా పక్కన పడేసిన రక్తం నుంచి పదార్థాలను విడగొట్టే అత్యాధునిక పరికరం. దీన్ని వైద్య పరిభాషలో ‘హెవీ డ్యూటీ కూలింగ్‌ సెంట్రీఫ్యూజ్‌ మిషన్‌’ అంటారు. 200 పడకలున్న ఈ ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు అత్యవసర పరిస్థితుల్లో రక్త పదార్థాలను వేర్వేరుగా అందించవచ్చనే లక్ష్యంతో ఆరేళ్ల కిందట నెలకొల్పారు. అయితే కొవిడ్‌ కాలం నుంచి దీన్ని వాడడం మానేశారు.

Published : 20 May 2022 06:08 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృథాగా అత్యాధునిక వైద్య పరికరాలు
వైద్యాధికారుల నిర్లక్ష్యమే కారణం

ఇది భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో రెండేళ్లుగా పక్కన పడేసిన రక్తం నుంచి పదార్థాలను విడగొట్టే అత్యాధునిక పరికరం. దీన్ని వైద్య పరిభాషలో ‘హెవీ డ్యూటీ కూలింగ్‌ సెంట్రీఫ్యూజ్‌ మిషన్‌’ అంటారు. 200 పడకలున్న ఈ ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు అత్యవసర పరిస్థితుల్లో రక్త పదార్థాలను వేర్వేరుగా అందించవచ్చనే లక్ష్యంతో ఆరేళ్ల కిందట నెలకొల్పారు. అయితే కొవిడ్‌ కాలం నుంచి దీన్ని వాడడం మానేశారు.

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొల్పిన రక్తం నుంచి ప్లాస్మా, ప్లేట్‌లెట్లు, ఎర్ర రక్త కణాలను విడదీసే పరికరాలను వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం తాండవిస్తోంది. సుమారు రూ.15 కోట్లతో సూర్యాపేట, నల్గొండ, భద్రాచలం, జనగామ, జగిత్యాల, కొత్తగూడెం, నిర్మల్‌, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, తాండూరు, గద్వాల తదితర 20 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరేళ్ల కిందటే పరికరాలను బిగించినా.. గత రెండేళ్లుగా వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదు. అంతకుముందు కూడా డెంగీ కేసులు పెరిగిన సందర్భాల్లో ప్లేట్‌లెట్ల వినియోగానికి మాత్రమే వీటిని వాడుకున్నారు. ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా ప్రాణాలను నిలిపే ఇంత ముఖ్యమైన పరికరాలను వినియోగించకపోవడానికి వైద్యాధికారుల్లో చిత్తశుద్ధి లోపించడమే ప్రధాన కారణమనే విమర్శలున్నాయి. ఇటీవల వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమీక్షలో ఈ పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. మంత్రి సంబంధిత అధికారులపై మండిపడినట్లు తెలిసింది. తక్షణమే పరికరాలన్నింటినీ వినియోగంలోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు.

ప్రభుత్వ వైద్యంలోనే ఎందుకు?

ప్రస్తుతం ఏ ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ‘హోల్‌ బ్లడ్‌’ను ఎక్కించడం లేదు. అంటే సేకరించిన రక్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎక్కించడం లేదు. ఆ రక్తం నుంచి ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్లను విడగొడుతున్నారు. ఎవరికి ఏది అవసరమో అదే ఎక్కిస్తున్నారు. అరుదుగా వైద్యుల సూచనలను బట్టి సేకరించిన రక్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎక్కిస్తున్నారు. రక్తంలోని పదార్థాలను విడగొట్టడం వల్ల ఎక్కువ మందికి లబ్ధి చేకూరడమే కాకుండా.. నిల్వ కాలం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు ఎర్ర రక్త కణాలను 35-42 రోజుల పాటు.. ప్లాస్మాను ఒక ఏడాది.. ప్లేట్‌లెట్లను 5 రోజులు నిల్వ ఉంచుతారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఎర్ర రక్తకణాలు కావాలి. ముఖ్యంగా గ్రామీణంలో గర్భిణులకు వీటి అవసరం ఎక్కువ. డెంగీ రోగికి కొన్ని సందర్భాల్లో ప్లేట్‌లెట్ల అవసరం ఉంటుంది. కాలిన గాయాలతో బాధపడుతున్న వారికి, కొన్ని రకాల నరాల సంబంధిత వ్యాధుల్లోనూ ప్లాస్మా అత్యవసరమవుతుంది. ఈ చికిత్సలకు ప్రైవేటులో ఖరీదు ఎక్కువే. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ పరికరాలను నెలకొల్పింది. ఈ ప్రక్రియ కోసం అవసరమైన మానవ వనరులను సమకూర్చుకోవడానికి జాతీయ ఆరోగ్య మిషన్‌ నుంచి అదనంగా 120 పోస్టులు మంజూరు చేయగా.. వీరికి తగిన శిక్షణ కూడా ఇచ్చారు. పరికరాన్ని నిర్వహించడం తెలిస్తే.. ఆటోమెటిక్‌గా మిషనే రక్తంలోని పదార్థాలను విడగొడుతుంది. అయినా ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అయితే తమకు నష్టం జరుగుతుందని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఉద్దేశపూర్వకంగా కొన్నిచోట్ల ఈ ప్రక్రియకు అడ్డుతగులుతున్నాయని, ఇందుకు కొందరు ఉన్నతాధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా సర్కారు చొరవ తీసుకొని ఈ పరికరాలను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని