Published : 20 May 2022 05:44 IST

ఈవీ విప్లవంలో తెలంగాణ ముందంజ

యూకేఐబీసీ రౌండ్‌టేబుల్‌ సదస్సులో కేటీఆర్‌
వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో భేటీ
ఔషధ విశ్వవిద్యాలయంపై ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచంలో విద్యుత్‌ వాహనాల(ఈవీ)దే భవిష్యత్తు అని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ విప్లవంలో తెలంగాణ ముందుందని, అత్యుత్తమ ఈవీ విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇప్పటికే 24కి పైగా సంస్థలు తెలంగాణలో ఈవీ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయని చెప్పారు. బ్రిటన్‌ పర్యటనలో భాగంగా గురువారం రెండో రోజు మంత్రి యూకే-ఇండియా వాణిజ్యమండలి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో మాట్లాడారు. ‘తెలంగాణ ప్రాధాన్యరంగంగా విద్యుత్‌ వాహనాల పరిశ్రమను గుర్తించి, భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించింది. రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధి రంగంలో పురోగమించింది. బ్రిటన్‌తో కలిసి కృత్రిమ మేధ, ఆరోగ్య, వ్యవసాయ, పారిశుద్ధ్య విభాగాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంది’ అని కేటీఆర్‌ వివరించారు.

అనంతరం మంత్రి లండన్‌లోని ప్రసిద్ధ సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని తమ ఔషధ పరిశ్రమను భారీగా విస్తరిస్తామని గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ పరిశోధన, అభివృద్ధి విభాగాధిపతి ఫ్రాంక్‌ రాయట్‌ కేటీఆర్‌కు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ టాస్క్‌ (తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌)తో పనిచేసేందుకు లండన్‌కు చెందిన పియర్సన్‌ కంపెనీ అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పనున్న వైమానిక విశ్వవిద్యాలయంలో భాగస్వామిగా చేరాలని ప్రముఖ విశ్వవిద్యాలయం క్రాన్‌ఫీల్డ్‌ ఛాన్సలర్‌ హాల్ఫార్డ్‌, వైస్‌ఛాన్సలర్‌ పొల్లార్డ్‌లను కేటీఆర్‌ కోరారు. హెచ్‌ఎస్‌బీసీ ప్రతినిధులు పాల్‌ మెక్‌ పియర్సన్‌, బ్రాడ్‌హిల్‌బర్న్‌, థామస్‌ లాయిడ్‌ గ్రూప్‌ ఎండీ నందిత సెహగల్‌ తదితరులు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. బ్రిటన్‌ పారిశ్రామిక సమాఖ్య (సీబీఐ) అధ్యక్షుడు బిలిమోరియా ఇచ్చిన విందులో కేటీఆర్‌తో పాటు బ్రిటన్‌ ఎంపీలు, భారత పారిశ్రామిక సమాఖ్య ప్రతినిధులు, ఇండో బ్రిటిష్‌ సమాఖ్య, సీబీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

కింగ్స్‌ కళాశాలతో ఎంవోయూ

లండన్‌లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్‌ కళాశాలతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఔషధ విశ్వవిద్యాలయం ఏర్పాటు, అందులో ఉన్నతవిద్యాకోర్సులు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపుతో పాటు పాఠ్యాంశాల తయారీలో తెలంగాణతో కళాశాల కలిసి పనిచేస్తుంది. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, కింగ్స్‌ కళాశాల ఆరోగ్య, జీవశాస్త్రాల విభాగం సీనియర్‌ ఉపాధ్యక్షుడు రిచర్డ్‌ ట్రెంబాత్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు. ‘ఔషధ పరిశోధన, శిక్షణలో ప్రపంచంలోని అత్యంత నైపుణ్యం కల విశ్వవిద్యాలయంతో ప్రభుత్వం కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది’ అని కేటీఆర్‌ అన్నారు. కళాశాల అధ్యక్షుడు, ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ షిట్జి కపూర్‌, అంతర్జాతీయ విద్యావిభాగం అధిపతి స్టీవ్‌స్మిత్‌లు మాట్లాడుతూ.. ‘ఈ  ఒప్పందంతో పరిశోధన, బోధన అంశాల్లో తెలంగాణకు అంతర్జాతీయ నైపుణ్యం, సహకారం లభిస్తుంది’ అని తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని