రుణాలపై స్పష్టత ఇవ్వండి

బాండ్ల విక్రయం ద్వారా తీసుకునే రాష్ట్ర అభివృద్ధి రుణాలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్రం కొత్త నిబంధనల నేపథ్యంలో సుమారు నెలన్నర రోజులుగా రాష్ట్ర రుణాలకు బ్రేక్‌పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం లేవనెత్తిన....

Published : 20 May 2022 06:06 IST

కేంద్రాన్ని కోరిన తెలంగాణ
ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: బాండ్ల విక్రయం ద్వారా తీసుకునే రాష్ట్ర అభివృద్ధి రుణాలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్రం కొత్త నిబంధనల నేపథ్యంలో సుమారు నెలన్నర రోజులుగా రాష్ట్ర రుణాలకు బ్రేక్‌పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇప్పటికే వారు కోరిన సమాచారం, వివరణలను లేఖల రూపంలో అందచేసింది. తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం దిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ ముఖ్య అధికారులను నేరుగా కలిసి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల హేతుబద్ధతను వివరించారు. ప్రధానంగా ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ (ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజిమెంట్‌-ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం పరిధిలో తీసుకుంటున్న రుణాలతోపాటు బడ్జెట్‌ వెలుపల ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకుంటున్న రుణాలను వినియోగిస్తున్న తీరును వివరించారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ చేపట్టిన మిషన్‌ భగీరథ, వాటితో అందుతున్న ఫలాలు, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం వివిధ వర్గాలకు అందిస్తున్న చేయూత, ఇతర మౌలిక సదుపాయలపై చేస్తున్న వ్యయం వంటి కీలక అంశాలను కేంద్రానికి వివరించారు. బడ్జెట్‌ వెలుపల తీసుకునే రుణాలను కూడా బడ్జెట్‌ పరిధిలోకి తీసుకోవడం, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో తీసుకున్న రుణాలను పరిగణనలోకి తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్రం నిబంధనలతో సుమారు రూ. లక్ష కోట్ల మేర నిధుల కొరత ఏర్పడుతుందని, ఫలితంగా ఇప్పటికే చేపట్టిన పథకాల కొనసాగింపు సమస్యాత్మకంగా మారి రాష్ట్ర అభివృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించినట్లు తెలిసింది. కేంద్రం రుణాలపై స్పష్టత ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిశీలించనున్నట్లు తెలిపిందని సమాచారం. దేశ వ్యాప్తంగా ఏకీకృత విధానంలో భాగంగా కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నట్లు తెలిసింది. కేంద్ర ఆర్థిక మంత్రితోనూ ఈ అంశాలపై చర్చించాలా? లేదంటే ఎలా ముందుకెళ్లాలి? అని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు  సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని