Updated : 21 May 2022 06:47 IST

Disha Encounter Case: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ కట్టుకథే

పది మంది పోలీసులపై హత్యానేరం నమోదు చేయాల్సిందే
ఆత్మరక్షణకే వారు కాల్పులు జరిపారనేందుకు ఆధారాల్లేవ్‌
దిశ హత్యాచార నిందితుల్ని చంపాలనేదే వారి ఉద్దేశం
జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ వెల్లడి
సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పణ

ఈనాడు, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ కట్టుకథ అని జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పుర్కర్‌ కమిషన్‌ తేల్చింది. ఇందులో పాల్గొన్న పదిమంది పోలీసులపై హత్యానేరం నమోదు చేయాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో సూచించింది. 2019 డిసెంబరు 6న షాద్‌నగర్‌ సమీపంలోని శివార్లలో జరిగిన కాల్పుల్లో జొల్లు శివ, జొల్లు నవీన్‌, చెన్నకేశవులు, ఆరిఫ్‌లు మరణించిన ఉదంతంపై సుప్రీంకోర్టు జస్టిస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తి చేసిన కమిషన్‌ 383 పేజీల నివేదికను సమర్పించింది. ఆత్మరక్షణ కోసమే ఎదురుకాల్పులు జరిపామన్న పోలీసుల వాదనను తూర్పారబట్టింది. పోలీసుల వాదనల్లో పొంతనే లేదని.. కేసు దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని స్పష్టం చేసింది. నిందితులను చంపాలనే ఉద్దేశమే పోలీసుల్లో కనిపించిందని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

నిందితులు కాల్చారన్నది నిరాధారం 

ఆయుధాల వాడకంపై అవగాహన లేని వ్యక్తి పిస్టల్‌ లాక్కొని కాల్పులు జరపడం సాధ్యమవుతుందా అని ఇన్స్‌పెక్టర్‌ నర్సింహారెడ్డిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలిచ్చారు. ఇదే విషయాన్ని బాలిస్టిక్‌ నిపుణులు ఎన్‌.బి.బందన్‌ను అడిగితే అసాధ్యమన్నారు. పిస్టల్‌ సేఫ్టీలాక్‌ ఆన్‌లో ఉందో లేదో దర్యాప్తు చేశారా అని సిట్‌ చీఫ్‌ మహేశ్‌భగవత్‌ను అడిగితే లేదన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాన్ని ఎలా అన్‌లాక్‌ చేశారని సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ను ప్రశ్నిస్తే అవి అప్పటికే అన్‌లాక్‌ చేసి ఉన్నట్లు షాద్‌నగర్‌ సీఐ తనకు చెప్పారన్నారు. 

* ఆయుధంతో కాల్చిన వ్యక్తి చేతిపై పడే పౌడర్‌ ఆధారంగా చేసే గన్‌షాట్‌ రెసిడ్యూ పరీక్ష నిర్వహించకపోవడం అనుమానాస్పదం.

* పోలీసులు లాల్‌మదార్‌, రవి, సిరాజుద్దీన్‌ నిలబడి కాల్పులు జరిపినట్లు గమనించలేదని.. తాను మోకాళ్లపై కూర్చొని కాల్పులు జరిపానని నర్సింహారెడ్డి కమిషన్‌ వద్ద పేర్కొన్నారు. కానీ నిలబడి కాల్చానని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వాంగ్మూలమిచ్చారు.

సందేహాస్పదంగా సేఫ్‌హౌస్‌ ఉదంతం 

‘దిశ’కు సంబంధించిన వస్తువుల్ని గుర్తించేందుకు నిందితులను పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో విచారణ కోసం గెస్ట్‌హౌస్‌ (సేఫ్‌హౌస్‌)లో ఉంచారు. కానీ గెస్ట్‌హౌస్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌ కమిషన్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో.. మూడు రోజుల అద్దె కోసం పోలీసులు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. పోలీస్‌ రికార్డుల్లో మాత్రం అద్దె చెల్లించినట్లు ఎలాంటి రికార్డు లేదు. నిందితులు ఇంకేమైనా అఘాయిత్యాలకు పాల్పడ్డారా? అని తెలుసుకునేందుకు సేఫ్‌హౌస్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. కానీ వారిని తీసుకెళ్లిన 21 గంటల వరకూ ఏసీపీ అక్కడికి రాలేదు. కానీ కేస్‌డైరీలో ఏసీపీ విచారణ జరిపినట్లు ఉంది.

అనుమానాస్పదంగా ‘అయిదో కట్ట’ 

‘దిశ’ వస్తువుల్ని నిందితులు పెద్ద విద్యుత్తు స్తంభం సమీపంలో దాచినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు. కానీ కమిషనర్‌ సజ్జనార్‌ మాత్రం నిందితులు వాటిని పొదల వెనక దాచారని మీడియా సమావేశంలో చెప్పారు.
* వస్తువులను దాచినట్లు చెప్పిన ‘అయిదో కట్ట’.. జాతీయ రహదారి-44 నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉంది. హైవే నుంచి నడవడానికి సరైన మార్గం లేని అక్కడికి చీకటివేళ వెళ్లి వస్తువుల్ని దాయడం అసాధ్యం. ‘దిశ’ వస్తువుల్ని గుర్తుపట్టేందుకు రావాలని తమకు పోలీసులు ఎలాంటి సమన్లు జారీ చేయలేదని ఆమె సోదరి కమిషన్‌కు చెప్పారు. కానీ పోలీసులు మాత్రం ఎన్‌కౌంటర్‌ జరిగిన మరుసటి రోజు ఆమెకు చూపించి ధ్రువీకరించుకున్నామన్నారు.

విరుద్ధ వాంగ్మూలాలు.. పొంతన లేని సమాధానాలు 

తామిద్దరం ఎన్‌కౌంటర్‌ స్థలంలో ‘దిశ’ వస్తువుల్ని సేకరించేటప్పుడు ఉన్నట్లు పంచనామా సాక్షులు రాజశేఖర్‌, రవూఫ్‌.. అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజు మధ్యాహ్నం 12.45కు సంఘటన స్థలంలోనే నిర్వహించిన పంచనామాలోనూ వారిద్దరినీ సాక్షులుగా పేర్కొన్నారు. కానీ ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత సంఘటన స్థలం నుంచి వెళ్లిన తాము తిరిగి సాయంత్రం 6 గంటలకే ఘటనాస్థలికి వచ్చినట్లు వారిద్దరూ వాంగ్మూలంలో పేర్కొనడం పరస్పర విరుద్ధం.
* రెండు 9 ఎంఎం పిస్టళ్లు, ఒక ఏకే-47, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధాలతో 41 రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నా ఘటన్థాలిలో కేవలం 19 ఖాళీ క్యాట్రిడ్జ్‌లు మాత్రమే లభ్యమయ్యాయి. మొత్తం క్యాట్రిడ్జ్‌లు దొరక్కపోయినా 41 రౌండ్ల కాల్పులు జరిగాయని నిర్ధారణకు రావడం అనుమానాలు రేకెత్తిస్తోంది.

పోలీసుల తాత్సారం స్పష్టం 

ఎన్‌కౌంటర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను న్యాయస్థానానికి పంపించడంలో కావాలనే తాత్సారం చేశారు. పోలీసు కాల్పుల్లో ప్రాణనష్టం సంభవిస్తే అత్యవసరంగా టెలిగ్రామ్‌, రేడియోగ్రామ్‌, ఈ మెయిల్‌, ఫ్యాక్స్‌ లాంటి సాధనాల ద్వారా జిల్లా మెజిస్ట్రేట్‌ కోర్టుకు సమాచారం చేరవేయాలని పోలీస్‌ మాన్యువల్‌లో ఉన్నా ఆలస్యం చేశారు.
* సంచలనం సృష్టించిన ఈ కేసులో సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించలేదు.

పోలీసుల వాదన వాస్తవదూరం 

నిందితులు ఆరిఫ్‌, చెన్నకేశవులు జరిపిన కాల్పుల్లోనే మరో ఇద్దరు నిందితులు మరణించి ఉండొచ్చనే వాదన వాస్తవదూరం. పోలీసుల నుంచి నిందితులు లాక్కున్న 9 ఎంఎం పిస్టల్‌ రౌండ్ల కారణంగా శివ, నవీన్‌కు గాయాలు కాలేదని ఫోరెన్సిక్‌ నిపుణులు తేల్చిచెప్పారు. శివ, నవీన్‌లకు వెనక వైపు ఆరిఫ్‌, చెన్నకేశవులు ఉన్నారు. కానీ శివ, నవీన్‌లను ముందు నుంచి కాల్చినట్లుగా నివేదికలు స్పష్టం చేశాయి.


ఆ పది మంది పోలీసులపై..

* వి.సురేందర్‌, కె.నర్సింహారెడ్డి, షేక్‌ లాల్‌మదార్‌, మహ్మద్‌ సిరాజుద్దీన్‌, కొచ్చర్ల రవి, కె.వెంకటేశ్వర్లు, ఎస్‌.అరవింద్‌గౌడ్‌, డి.జానకిరాం, ఆర్‌.బాలు రాథోడ్‌, డి.శ్రీకాంత్‌లపై సెక్షన్‌ 302 రెడ్‌విత్‌ 34 ఐపీసీ, 201 రెడ్‌విత్‌ 302 ఐపీసీ, 34 ఐపీసీ సెక్షన్లు నమోదు చేసి విచారించాలి. నలుగురు నిందితులనూ హతమార్చడమే వీరందరి ఉమ్మడి ఉద్దేశం.

* 302 ఐపీసీ (హత్యానేరం) సెక్షన్‌ నమోదుకు షేక్‌ లాల్‌మదార్‌, మహ్మద్‌ సిరాజుద్దీన్‌, కొచ్చర్ల రవి అర్హులు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపాం కాబట్టి చట్టపరంగా రక్షణ కల్పించాలనే వీరి వాదన నమ్మశక్యంగా లేదు. నిందితులపై కావాలనే కాల్పులు జరిపినందుకు 76 ఐపీసీ, 300 ఐపీసీ సెక్షన్‌ 3 నుంచి మినహాయింపు ఇవ్వడం సరికాదు.


సిట్‌ నివేదిక లోపాల పుట్ట

నిందితులు పారిపోయేందుకు తమ కళ్లలో మట్టి, బురద కొట్టారని పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఇచ్చిన వాంగ్మూలాల్లో పేర్కొన్నారు. కానీ పచ్చని చెట్లతో ఉన్న ఆ ప్రాంతంలో ఎంతో ప్రయత్నిస్తే గానీ మట్టిని తీయలేరు. 12 మంది సాయుధ పోలీసుల కళ్లలో మట్టికొట్టి దాడి చేయడం దాదాపు అసాధ్యం.

* నిందితుల దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడినట్లు సిట్‌ ఇచ్చిన నివేదిక లోపాలమయం. ఇద్దరికి రక్తగాయాలయ్యాయని ఐపీఎస్‌ అధికారి అపూర్వారావు పేర్కొన్నారు. మరో నివేదికలో మాత్రం ఒక్కరికే రక్తగాయాలైనట్లు ఉంది. నిందితుడు జొల్లు శివ కర్రతో పోలీసు అధికారి అరవింద్‌గౌడ్‌ను.. మరో నిందితుడు జొల్లు నవీన్‌ రాళ్లతో పోలీసు అధికారి వెంకటేశ్వర్లును కొట్టారని పోలీసుల తుది నివేదికలో ఉంది. ఒక నివేదికలో క్షతగాత్రుల్ని కేర్‌ ఆసుపత్రికి, మరో నివేదికలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వారికి ఎక్స్‌రే లేదా సీటీ స్కాన్‌ చేసినట్లు కమిషన్‌కు కేర్‌ ఆసుపత్రి ఎలాంటి ఆధారాలివ్వలేదు. అరవింద్‌గౌడ్‌ భుజానికి గాయమైనట్లు రికార్డుల్లో ఉంటే.. కడుపు, మెదడులో సీటీస్కాన్‌ చేసినట్లు డిశ్ఛార్జి సమ్మరీలో పేర్కొన్నారు.
* నిందితుల దాడితో ఘటనాస్థలిలో స్పృహ కోల్పోయిన తాను కేర్‌ ఆసుపత్రిలోనే కళ్లు తెరిచానని అరవింద్‌గౌడ్‌ మెజిస్ట్రేట్‌కు తెలిపారు. కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం ఘటనాస్థలిలో అపస్మారక స్థితిలో ఉన్నా, కాల్పుల శబ్దం విన్నానని పేర్కొన్నారు.


తక్షణ న్యాయం వాంఛనీయం కాదు 

మూకదాడి ఎలా ఆమోదయోగ్యం కాదో.. తక్షణ న్యాయం అన్న ఆలోచన కూడా వాంఛనీయం కాదు. సర్వకాల సర్వావస్థల్లోనూ చట్టమే పరిఢవిల్లాలి. చట్ట బద్ధమైన నిబంధనల కిందే నేరస్థులను శిక్షించాలి’’

-జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పుర్కర్‌ కమిషన్‌


ఆయుధాలు లాక్కున్నారన్నది కట్టుకథ

నిందితులు ఆయుధాలు లాక్కున్నారన్నది ఏసీపీ సురేందర్‌ అల్లిన కట్టుకథ. ఇద్దరు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కున్నట్లు చూశానని  సురేందర్‌ చెప్పారు. తర్వాత ఒకరి నుంచే అని మాట మార్చారు. ఒకే పిస్టల్‌ పౌచ్‌ను వేర్వేరు ప్రదేశాల నుంచి పలుమార్లు స్వాధీనం చేసుకున్నట్లు నివేదికల్లో పేర్కొనడం ఆశ్చర్యకరం.


నలుగురినీ చంపాలనేదే వారి ఉద్దేశం 

నిందితులు నలుగురూ ఆయుధాలు లాక్కొని పారిపోవడం.. పోలీసులపై దాడికి దిగడం లాంటివి చేయలేదని భావిస్తున్నాం. ఎన్‌కౌంటర్‌పై పోలీసులు చెబుతున్న వాదనకు అర్థం లేదు. నిందితుల ప్రాణాలు తీయాలనే ఉద్దేశం పోలీసుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

- జస్టిస్‌ వి.ఎస్‌. సిర్పుర్కర్‌ కమిషన్‌  నివేదిక


 

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని