Published : 21 May 2022 06:13 IST

CM KCR: దిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్‌

రేపు చండీగఢ్‌కు పయనం

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు, దిల్లీ: జాతీయ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రానికి దిల్లీకి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు స్వాగతం పలికారు. తుగ్లక్‌ రోడ్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో శనివారం ఆయన ఆర్థిక రంగ నిపుణులు, ప్రముఖ పాత్రికేయులతో భేటీకానున్నట్లు సమాచారం. దిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులపై ఎండీపీ ఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధులతో మాట్లాడనున్నారు. ప్రజల ఎజెండాతో జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రూపకల్పన కోసం రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి నేతలతో చర్చలు జరిపిన ఆయన తాజాగా విస్తృతస్థాయిలో దిల్లీ, పంజాబ్‌, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు, జాతీయస్థాయి నేతలు తదితరులతో సమావేశమవుతారు. ఈ నెల  22వ తేదీన మధ్యాహ్నం దిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 మంది రైతుల కుటుంబాలను సీఎం కేసీఆర్‌ పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు. దాదాపు నాలుగు రోజుల పాటు కేసీఆర్‌ పంజాబ్‌లోనే ఉంటారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి  ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం ఉదయమే దిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎంపీలు సంతోష్‌కుమార్‌, రంజిత్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌లున్నారు.


తెరాస కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభం

దేశ రాజధాని దిల్లీలోని వసంత్‌ విహార్‌లో తెరాస కార్యాలయ నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు. అంతకుముందు నిర్వహించిన పూజా కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ దేశ రాజధాని నడిబొడ్డున తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే తెరాస భవన్‌ నిర్మాణ పనులు ప్రాంభమయ్యాయన్నారు. నిర్దేశిత గడువులోగానే కార్యాలయ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఇంత కీలక ఘట్టంలో తనకు స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ నిర్మాణానికి గతేడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమి పూజ చేసిన విషయం విదితమే.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని