Published : 21 May 2022 05:26 IST

ఇక.. వర్సిటీల వారీగా పీహెచ్‌డీ ప్రవేశాలు

నిర్వహణకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పచ్చజెండా
అయిదేళ్ల తర్వాత కేయూ ప్రకటన
అదేబాటలో మిగిలిన వర్సిటీలు
ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఇప్పట్లో లేనట్లే..!

ఈనాడు, హైదరాబాద్‌: పీహెచ్‌డీ ప్రవేశాలను ఇక నుంచి ఆయా విశ్వవిద్యాలయాలే సొంతంగా చేపట్టనున్నాయి. అందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి పచ్చజెండా ఊపింది. ఇటీవల జరిగిన ఆరు వర్సిటీల ఉపకులపతుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరపాలని ఉన్నత విద్యామండలి దాదాపు ఏడాది క్రితం నిర్ణయించగా.. ప్రస్తుతం దాన్ని వాయిదా వేశారు. తాజా నిర్ణయం నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఏడాదిగా చర్చించి.. చివరకు వెనుకడుగు
పీహెచ్‌డీ ప్రవేశాల సందర్భంగా సీట్ల కోసం ఉపకులపతు(వీసీ)లపై విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న కారణంగా ప్రవేశాల ప్రక్రియ ప్రతిసారీ వివాదాస్పదంగా మారుతోందన్న ఉద్దేశంతో ఈసారి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావించింది. దీని వల్ల తమకూ సమస్యలు ఉండవని వీసీలు భావించారు. ఆ ఫలితంగానే ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలతోపాటు అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి కలిపి ఉమ్మడి పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని గతేడాది జులై 1న అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం విధివిధానాల రూపకల్పనకు ఓ కమిటీని నియమించి సుమారు ఏడాది పాటు పలుమార్లు చర్చించినా తుది నిర్ణయానికి రాలేకపోయారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానంపై విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వర్సిటీల వారీగా పరీక్షలు నిర్వహించాలని అవి డిమాండ్‌ చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తే అది వివాదంగా మారి.. ఇతర అంశాలు అమలుకావని అధికారులు అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ కారణంగానే దాన్ని పక్కనపెట్టాలని నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే వర్సిటీల వారీగా పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు ఈ నెల 16న జరిగిన వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి ఆమోదం తెలిపింది.

ఏళ్లుగా ఎదురుచూపులు
ఒకసారి పీహెచ్‌డీ ప్రవేశాలు జరిపితే మళ్లీ ఎన్నేళ్లకు నోటిఫికేషన్‌ వెలువడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కేయూ చివరిసారిగా 2016-17 విద్యాసంవత్సరానికి 2017లో ప్రకటన జారీ చేసింది. అప్పటి నుంచి అయిదేళ్లవుతున్నా ఆ వర్సిటీ మరో పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ను విడుదల చేయకపోగా.. తాజాగా ఉన్నత విద్యామండలి ఆమోదం నేపథ్యంలో ఈ నెల 19న నోటిఫికేషన్‌ను వెలువరించింది. దీని ప్రకారం 26 విభాగాల్లో 212 పీహెచ్‌డీ సీట్ల భర్తీకి శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ప్రవేశ పరీక్ష తేదీని తర్వాత ప్రకటించనున్నారు. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌, రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌ తదితరాలు ఉన్న వారికి కేటగిరీ-1 కింద 50 శాతం సీట్లు భర్తీ చేస్తున్నామని, మరో 50 శాతం సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్‌ చెప్పారు. ఇక నుంచి ప్రతి ఆరు నెలలకోసారి నోటిఫికేషన్‌ జారీ చేస్తూ ఖాళీ సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించామని వివరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చివరిసారి 2018లో పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ జారీ అయింది. తరవాత ప్రకటన విడుదల చేయక నాలుగేళ్లు అవుతోంది. వర్సిటీల వారీగా పీహెచ్‌డీ ప్రవేశాలకు పరీక్ష నిర్వహించుకోవడానికి ఆమోదం రావడంతో సీపీగేట్‌(పీజీ ప్రవేశ పరీక్ష) తర్వాత ఆ వర్సిటీ ప్రకటన ఇవ్వనుంది. మిగిలిన విశ్వవిద్యాలయాలు కూడా అదేబాటలో నడవనున్నాయి.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts