Updated : 21 May 2022 06:03 IST

సంక్షిప్త వార్తలు


ఆహారభద్రత చట్టం అమలుకు విజిలెన్స్‌ కమిటీ నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: ఆహర భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్‌ కమిటీని నియమించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి పౌరసరఫరాల శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వైస్‌ ఛైర్మన్‌గా, ఆహార భద్రత చట్టం వ్యవహారాలను రాష్ట్రంలో పర్యవేక్షించే డిప్యూటీ కమిషనర్‌ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మహిళాశిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, వైద్యారోగ్యశాఖ, ఉన్నత విద్య, గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శులు, పౌరసరఫరాల సంస్థ వైస్‌ ఛైర్మన్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లు, తూనికలు-కొలతల కంట్రోలర్‌, రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్య కార్యదర్శి, చమురు సంస్థల సమన్వయకర్త, చౌకధరల దుకాణాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పౌరసరఫరాల శాఖ ఉప కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏటా జనవరి, జూన్‌ నెలల్లో విధిగా సమావేశం అవుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


నేడు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను శనివారం ఉదయం 9గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోరింది. ఆలయంలో నిజపాద దర్శనం సేవను తితిదే తాత్కాలికంగా రద్దు చేసినందున శుక్రవారం ఉదయం 8గంటలనుంచే సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. వేసవి రద్దీ నేపథ్యంలో తితిదే నిజపాద దర్శనాన్ని రద్దుచేసింది.


ప్రధాని పర్యటనపై సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు ఈ నెల 26న రానున్న ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ప్రధాని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారని, వివిధ శాఖలు ఎస్‌పీజీతో సమన్వయం చేసుకుంటూ ప్రొటోకాల్‌ అనుసారంగా పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


డిజిటల్‌ జీవన ప్రమాణ ధ్రువీకరణ నమోదు చేయాలి

ఈనాడు, హైదరాబాద్‌: ఫింఛను ఆగిపోయిన...ఈపీఎఫ్‌ పింఛనుదారులంతా డిజిటల్‌ జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని హైదరాబాద్‌ ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ ఎం.హెచ్‌.వార్సి ఒక ప్రకటనలో తెలిపారు.


కొత్తగా 45 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 45 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 20న నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 413 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,870 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,48,86,577కు పెరిగింది. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో 33 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.


హెల్త్‌ కేర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ అల్లైడ్‌ హెల్త్‌ కేర్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా డాక్టర్‌ విజయ్‌కుమార్‌ (నిమ్స్‌), ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌, మంచిర్యాల వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సులేమాన్‌, గాంధీ మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ దేవోజీ మాలోత్‌ను నియమించారు. వీరి ఎంపిక పట్ల రాష్ట్ర ప్రభుత్వ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్ల అసోసియేషన్‌ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts