టీ-శాట్‌ ఆన్‌లైన్‌ నమూనా పరీక్షలు

ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడుతున్న ఉద్యోగార్థుల కోసం టీ-శాట్‌ ఆన్‌లైన్‌ నమూనా పరీక్షల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 24 గంటలూ ఇవి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి నమూనా పరీక్షలో 150 ప్రశ్నలుంటాయి

Published : 22 May 2022 05:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడుతున్న ఉద్యోగార్థుల కోసం టీ-శాట్‌ ఆన్‌లైన్‌ నమూనా పరీక్షల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 24 గంటలూ ఇవి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి నమూనా పరీక్షలో 150 ప్రశ్నలుంటాయి. ఈ ప్రశ్నలకు 2.30 గంటల్లో సమాధానాలివ్వాల్సి ఉంటుంది. టీ-శాట్‌ మొబైల్‌ యాప్‌, టీ-శాట్‌ వెబ్‌సైట్లో నమూనా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని, ప్రస్తుతం టెట్‌తో పాటు కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు నిర్వహిస్తున్నామని టీ-శాట్‌ సీఈవో శైలేష్‌రెడ్డి తెలిపారు. 

ఆన్‌లైన్‌లో వీడియో పాఠాలు, నిపుణులతో శిక్షణ ఇస్తూనే, అభ్యర్థులకు మాక్‌టెస్ట్‌ల కోసం టీ-శాట్‌ 25 వేల ప్రశ్నలతో నిధి సిద్ధం చేసింది. దీన్నుంచి నమూనా పరీక్షలకు ర్యాండమ్‌గా ప్రశ్నలు వస్తుంటాయి. ఇటీవల స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలకు ఆన్‌లైన్‌లో నమూనా పరీక్షలు విజయవంతం కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలను నిర్వహిస్తోంది. టెస్ట్‌ ప్రారంభించిన 2.30 గంటల సమయం అనంతరం యాప్‌ ఆటోమేటిక్‌గా మూత పడుతుంది. వెంటనే అభ్యర్థులు పొందిన మార్కులు తెరపై కనిపిస్తాయి.  

పరీక్షకు రిజిస్ట్రేషన్‌ ఇలా! 
నమూనా పరీక్షను టీ-శాట్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా రాయవచ్చు. ప్రశ్నలకు సమాధానాలను ఆప్షన్లపై క్లిక్‌ చేయాలి. వెబ్‌సైట్‌ లేదా యాప్‌లోకి ప్రవేశించిన తరువాత ‘మాక్‌ ఎగ్జామ్స్‌’ ఆప్షన్‌ ఉంటుంది. ఇందులోకి ప్రవేశించి, రాయనున్న పరీక్షను ఎంచుకోవాలి. తర్వాత అభ్యర్థిపేరు, విద్యార్హత, ఈ-మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబరు నమోదు చేయాలి. ఇప్పటికే నమూనా పరీక్షలకు 8 వేల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.

టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనూ..
రాష్ట్రంలో పోలీసు నియామకాల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసీ సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థులకు సహకరించే క్రమంలో ఆన్‌లైన్‌లో నమూనా(మాక్‌) పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శిక్షణ ఇచ్చే శ్రీధర్‌ సీసీఈ సంస్థ సహకారంతో నమూనా పరీక్షలకు ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం కోసం ‌www.tsrtc.telangana.gov.in  చూడాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని