Published : 22 May 2022 05:20 IST

భూసేకరణే అసలు సమస్య

పనులు చేపట్టాల్సిన తరుణం మించుతున్నా పడని ముందడుగు 
తక్షణం సేకరించాల్సింది 2,600 ఎకరాలు 
నిధుల బకాయిలతోనూ ఆటంకం 
కాళేశ్వరం, పాలమూరు, సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల పరిస్థితి

ఈనాడు - హైదరాబాద్‌: ‘‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకమైన కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి కావాలంటే తక్షణం 420  ఎకరాల భూసేకరణ చేపట్టాలి. వట్టెం తదితర జలాశయాల కింద పునరావాసానికే ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో మూడో దశ కింద సాగునీరు ఇవ్వాలంటే 264 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.’’

ప్రభుత్వ ప్రాధాన్య రంగమైన నీటిపారుదలకు భూసేకరణ కీలక సమస్యగా మారింది. కాళేశ్వరం ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి, దేవాదుల, ఎల్లంపల్లి, సీతారామ, చనాకా-కొరాటా, డిండి ప్రాజెక్టుల పనులకు భూసేకరణ, నిధుల బకాయిలు ఆటంకంగా మారాయి. వచ్చే ఏడాది 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యాన్ని నీటిపారుదల శాఖ నిర్దేశించుకుంది. ఈ వానాకాలంలోనూ లక్ష్యం మేరకు సాగునీరు అందాలంటే ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు నీరందించే డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టాల్సి ఉందని క్షేత్రస్థాయి ఇంజినీర్లు చెబుతున్నారు. మరోవైపు పనులు వేగంగా జరగాల్సిన తరుణం కూడా మించిపోతోంది. సాధారణంగా డిసెంబరు నుంచి జూన్‌ రెండో వారం మధ్యనే పనులు వేగంగా చేపడతారు. ఈ సమయంలో పంటల సాగు తక్కువగా ఉండటం, వర్షాలు ఉండకపోవడం వల్ల మట్టి, సిమెంటు పనులు చేయడానికి వీలుంటుంది. ప్రస్తుతం నిధులు విడుదల చేసినా చివరి దశలో ఉన్న పనులు తప్ప మిగిలిన నిర్మాణాల్లో జాప్యం తప్పదని ఇంజినీరింగ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ఆయకట్టు మురవాలంటే.. 

కాళేశ్వరంతోపాటు పలు ప్రాజెక్టుల పరిధిలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నా ఆయకట్టుకు మాత్రం సాగునీరు చేరని పరిస్థితులు ఉంటున్నాయి. గతేడాది నుంచి చెరువులు నింపుతూ నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది ఎలాగైనా ఆయకట్టుకు నీరందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఆయకట్టుకు నీరందించేందుకు తక్షణం దాదాపు 2,600 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ఏడాది దాదాపు వెయ్యి ఎకరాల వరకు నీటిపారుదల శాఖకు రెవెన్యూ శాఖ(భూసేకరణ) అందజేయాల్సి ఉన్నట్లు అంచనా. 

పలు ప్రాజెక్టుల కింద పరిస్థితి ఇలా..

ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో కాళేశ్వరం పరిధిలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ల కింద 1,600 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.100 కోట్ల వరకు అవసరం. ప్రాజెక్టు పరిధిలో నాలుగో లింకు కింద మధ్యమానేరు నుంచి కొండపోచమ్మసాగర్‌ వరకు 5.89 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మధ్యమానేరు పరిధిలో మాత్రమే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఉంది. ఐదో లింకులో కొమరవెల్లి మల్లన్నసాగర్‌ నుంచి సింగూరు వరకు 3.29 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ కూడా కొత్త డిస్ట్రిబ్యూటరీలను నిర్మించాల్సి ఉంది. అదనపు(మూడో) టీఎంసీకి సంబంధించి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కొంత భూసేకరణ చేయాల్సి ఉంది. 

* ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నార్లాపూర్‌ నుంచి కర్వెన జలాశయం వరకు ప్రధాన కాల్వలకు భూసేకరణ, జలాశయాల కింద పునరావాసానికి నిధులు చెల్లించాల్సి ఉంది. రూ.20 కోట్ల వరకు బకాయిలున్నాయి. 

* భద్రాద్రి జిల్లా పరిధిలో సీతారామ ఎత్తిపోతల పథకం కింద పనుల్లో వేగం పుంజుకోవాలంటే కనీసం 1,132 ఎకరాలు సేకరణ చేయాల్సి ఉండగా.. రూ.100 కోట్ల పరిహారం అందించాల్సి ఉంది. ఖమ్మం జిల్లా పరిధిలో మొత్తం 758.24 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. రైతులకు రూ.264.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. 

* దేవాదుల ఎత్తిపోతల కింద రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.2.50 కోట్ల బకాయిలున్నాయి. 

* ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని చనాకా-కొరాటా కింద రెండు ప్రధాన కాల్వలు అసంపూర్తిగానే ఉన్నాయి. వచ్చే సెప్టెంబరులో ‘వెట్‌రన్‌’(నమూనా ఎత్తిపోత) నిర్వహించనున్నారు. 51 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా 1780.35 ఎకరాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీల పనులకు భూసేకరణ చేయాల్సి ఉంది. 

పరిహారం చెల్లింపులో జాప్యం..

నీటిపారుదల శాఖకు సంబంధించిన నిర్మాణాలకు సేకరిస్తున్న భూమికి పరిహారం చెల్లింపు పూర్తిస్థాయిలో జరగడం లేదు. శాఖ నుంచి నిధుల విడుదలలో జాప్యం ఒక కారణం కాగా.. మంజూరైన పరిహారాన్ని బాధితులు కొన్నిచోట్ల తిరస్కరిస్తుండటం మరొకటి. స్థానిక భూవిలువ ఆధారంగా చెల్లించాలని వారు కోరుతున్నారు. దీంతో ఈ నిధులను భూసేకరణ, పునరావాసం, పునరాశ్రయ అథారిటీ వద్ద భూసేకరణ విభాగం డిపాజిట్‌ చేస్తోంది. ఇలా ఒక్క సిద్దిపేట జిల్లాలోనే రూ.200 కోట్ల విలువైన పరిహారం నిలిచిపోయి ఉంది. నీటిపారుదల శాఖ నుంచి విడుదల చేయాల్సిన మొత్తం కూడా సకాలంలో రావడం లేదు. ఈ విషయంలో ఇటీవల ఆ శాఖ ముఖ్య ఇంజినీర్ల వినతి మేరకు ఆర్థిక శాఖతో ప్రత్యేక భేటీ నిర్వహించి సమస్యను విన్నవించాలని నిర్ణయించినప్పటికీ ముందడుగు పడలేదు. 

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని