పిలుస్తోంది ఐటీ కొలువు

జోరుగా ఐటీ ఉద్యోగాలు.. ఆకర్షణీయ ప్యాకేజీలు.. గతంలో ఎన్నడూ లేనంతగా కళాశాల ప్రాంగణాల్లో, బయట ఎంపికలు.. ఉద్యోగార్థులకు ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని

Updated : 23 May 2022 08:15 IST

ప్రాంగణ, ప్రాంగణేతర నియామకాల జోరు

ఏడాదిలో 5 లక్షల మేర కొత్త ఉద్యోగాలు

రూ. 45 లక్షల వరకు వార్షిక జీతభత్యాలు

డిజిటల్‌ టెక్నాలజీలతో ఉద్యోగాల్లో వృద్ధి

ఈనాడు, వాణిజ్య విభాగం: జోరుగా ఐటీ ఉద్యోగాలు.. ఆకర్షణీయ ప్యాకేజీలు.. గతంలో ఎన్నడూ లేనంతగా కళాశాల ప్రాంగణాల్లో, బయట ఎంపికలు.. ఉద్యోగార్థులకు ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని చెప్పొచ్చు. డిగ్రీ, కొద్దిపాటి ఐటీ నైపుణ్యం ఉంటే.. ఉద్యోగం లభించడం పెద్ద కష్టం కాదు. కొత్త టెక్నాలజీల మీద నాలుగైదేళ్లు పనిచేసిన అనుభవం ఉంటే, భారీ జీతభత్యాలు చెల్లించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. వార్షిక జీతభత్యాలు రూ.4 లక్షల నుంచి 45 లక్షలు, ఇంకా పైన కూడా ఉంటున్నాయి. ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తోంది. కష్టించి పిల్లల్ని చదివిస్తే వారు మంచి వేతనంతో స్థిరపడే సానుకూలత లభిస్తోంది. కరోనా పరిణామాలతో డిజిటలీకరణ ఊపందుకోవడమే దీనికి ప్రధాన కారణం. మొత్తం ఐటీ ఉద్యోగుల్లో మహిళలు 36 శాతం. ఇది ఇంకా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

డిజిటల్‌కు మారాల్సిందే
ఆన్‌లైన్‌/మొబైల్‌ లావాదేవీలు పెరుగుతుండడంతో అన్ని వాణిజ్య సంస్థలూ డిజిటలీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి. వీటి నుంచి ప్రాజెక్టులు వస్తుండడంతో ఐటీ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కొవిడ్‌కు ముందు ఐటీరంగంలో ఏటా 2-2.5 లక్షల కొత్త ఉద్యోగాలు లభించేవి. గత 12 నెలల్లోనే 4.5-5 లక్షల కొత్త ఉద్యోగాలొచ్చాయి. కృత్రిమ మేధ-యంత్ర అభ్యాసం(ఏఐ- ఎంఎల్‌), బ్లాక్‌చైన్‌, ఏఆర్‌-వీఆర్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్సెస్‌, ఓపెన్‌ టెక్నాలజీల వినియోగం పెరుగుతోంది.

ఒక్కో కేంద్రంలో 100-500 ఉద్యోగాలు
మన దేశంలో ఐటీ నిపుణులు ఎక్కువగా ఉండడంతో అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాల కంపెనీలు అభివృద్ధి, పరిశోధన కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎన్నో కంపెనీల కేంద్రాలు ఇటీవల కూడా ఏర్పాటయ్యాయి. ఒక్కో కేంద్రంలో కనీసం 100 - 500 ఐటీ ఉద్యోగాలు లభిస్తున్నాయి.

* దేశీయ ఐటీ పరిశ్రమ ప్రస్తుతం 227 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది. 2030కి 350 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది.

* దేశంలో ఐటీ రంగం 50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగా, ఎనిమిదేళ్లలో ఈ సంఖ్య 70 లక్షలకు పెరుగుతుంది. 

* ఇకపై ఏటా కనీసం 3- 3.5 లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.

* ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు డిజిటల్‌ టెక్నాలజీ ప్రాజెక్టులకు ఇటీవల 1.8 లక్షల కోట్ల డాలర్ల బడ్జెట్‌ కేటాయించాయి. ఇది 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.310 లక్షల కోట్ల)కు చేరొచ్చు. ఇందులో సింహభాగాన్ని దేశీయ కంపెనీలు దక్కించుకోవచ్చు.


కొత్త ఉద్యోగాలు ఈ విభాగాల్లోనే ఎక్కువ

* ఏఐ ఇంజినీరింగ్‌
* జనరేటివ్‌ ఏఐ
* డేటా ఫ్యాబ్రిక్‌
* డిస్ట్రిబ్యూషన్‌ ఎంటర్‌ప్రైజ్‌
* టోటల్‌ ఎక్స్‌పీరియన్స్‌
* క్లౌడ్‌ నేటివ్‌ ప్లాట్‌ఫామ్స్‌
* అటానమస్‌ సిస్టమ్స్‌ (సెల్ఫ్‌ మేనేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌)
* డెసిషన్‌ ఇంటెలిజెన్స్‌
* హైపర్‌ ఆటోమేషన్‌
* సైబర్‌ సెక్యూరిటీ మెష్ (సీఎస్‌ఎంఏ)


డిజిటలీకరణ ఫలితమే
వి.రాజన్న, సీనియర్‌ ఉపాధ్యక్షుడు, గ్లోబల్‌ హెడ్‌, టీసీఎస్‌

2021-22 ఐటీ చరిత్రలో నిలిచిపోయే సంవత్సరం. మొదటిసారిగా భారత ఐటీ పరిశ్రమ 200 బిలియన్‌ డాలర్లను అధిగమించింది. 2020-21తో పోలిస్తే దాదాపు 15 శాతం వృద్ధితో 227 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇందులో ఎగుమతుల వాటాయే 78 శాతం. 2011 తర్వాత ఇదే అధిక వృద్ధి. దీంతో ఐటీ ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది. శాప్‌, ఒరాకిల్‌, ఎంటర్‌ప్రైజ్‌ డేటా ప్లాట్‌ఫామ్స్‌, క్లౌడ్‌, ఆటోమేషన్‌, ఓపెన్‌ టెక్నాలజీల్లో నిపుణుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి. డిజిటలీకరణ నైపుణ్యాలు మనదగ్గర బాగా పెరుగుతున్నాయి. వీటి అభివృద్ధిపై మనం దృష్టి సారించాలి. టీసీఎస్‌లో మేం ఈ పని చేస్తున్నాం. అకడమిక్‌ ఇంటర్‌ఫేస్‌ ప్రోగ్రామ్‌ ద్వారా విద్యా సంస్థలు- విద్యావేత్తలతో ఉమ్మడి పరిశోధన కార్యకలాపాలు చేపడుతున్నాం. డిజిటల్‌ టెక్నాలజీలపై 4.76 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చాం.  


ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయి
భరణికుమార్‌ అరోల్‌, సీఈవో, టెక్‌ట్రైడ్‌ సొల్యూషన్స్‌, హైసియా మాజీ అధ్యక్షుడు

ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు డిజిటలీకరణ చెందుతుండడంతో ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ ఐటీ ప్రాజెక్టు అయినా చేసే నైపుణ్యాలు మనదేశంలో ఉన్నాయి. ఈ స్థాయిలో మరే దేశమూ లేదనే చెప్పాలి. మొత్తం ఐటీ ఉద్యోగుల్లో డిజిటల్‌ నిపుణులు 8 శాతం నుంచి 30 శాతానికి పెరగడం కలిసొస్తోంది. నైపుణ్యాల విస్తరణకు హైసియా చేపట్టిన కార్యక్రమాల ఫలితాలు కనిపిస్తున్నాయి. బీటెక్‌ పాఠ్యప్రణాళికల్లో మార్పులు చేసుకుంటే, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సిద్ధమవుతారు.


అంకుర సంస్థల జోరూ కారణమే
కిరణ్‌ సీహెచ్‌, ఎండీ టెక్‌ ఎరా ఐటీ కన్సల్టింగ్‌

మనదేశంలో యూనికార్న్‌ (100 కోట్ల డాలర్ల విలువ ఉన్న సంస్థ) అంకుర సంస్థలు 100కు పైగానే ఉన్నాయి. ఇవి పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు సంపాదించాయి. నిపుణులను అధిక వేతనాలిచ్చి తీసుకుంటున్నాయి. కొవిడ్‌ తర్వాత అన్ని రంగాల్లోని సంస్థలు ఐటీ ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచాయి. దీనికి అంకుర సంస్థల జోరు కలిసి,  ఉద్యోగాలు బాగా పెరిగాయి.


వలసల వల్ల అధిక వేతనాలు
రమేష్‌ లోగనాథన్‌, ప్రొఫెసర్‌, ట్రిపుల్‌ ఐటీ, హైదరాబాద్‌

ప్రాజెక్టులను దక్కించుకున్న సంస్థలు అధిక వేతనాలు ఆఫర్‌ చేస్తున్నందున, ఐటీ రంగంలో ఉద్యోగ వలసలు ఎక్కువయ్యాయి. నిపుణులను అట్టేపెట్టుకునేందుకు కంపెనీలు అధిక వేతనాలు ఆఫర్‌ చేయడంతో పాటు, నియామకాలు ఎక్కువగా జరుపుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు