తెలంగాణ సాగు విధానాలు భేష్‌

తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు భేషుగ్గా ఉన్నాయని,  కేసీఆర్‌ రైతు అనుకూల పథకాలు దేశానికి ఆదర్శమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌  వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశంసించారు.

Published : 23 May 2022 04:16 IST

ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వడ్డే ప్రశంస

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు భేషుగ్గా ఉన్నాయని,  కేసీఆర్‌ రైతు అనుకూల పథకాలు దేశానికి ఆదర్శమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌  వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశంసించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఇంటికి వచ్చిన వడ్డే.. రాష్ట్ర, దేశ వ్యవసాయ రంగంపై ఆయనతో చర్చించారు. వడ్డే మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణ తప్పనిసరి అన్నారు. వరి తగ్గించి పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు వైపు రైతులు మళ్లాలని, ఆయిల్‌పామ్‌ సాగుకు తెలంగాణ ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. దేశంలో 1985-1989 మధ్య నూనెగింజలు - అపరాల సాంకేతిక మిషన్‌ పథకం అమలు తరహాలో ప్రస్తుతం అపరాలు, నూనె, పప్పుగింజల సాగుకు రైతులకు ప్రోత్సాహం అందించాల్సి ఉందన్నారు. ఇథనాల్‌ ఉత్పత్తిని, విదేశీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు వసతులు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మహిళా రైతు ఉత్పత్తి సంస్థలకు సహకరించాలని ఆయన తెలంగాణ సర్కారుకు సూచించారు. మద్దతుధరల విషయంలో కేంద్రం అవలంబిస్తున్న విధానాల మూలంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వడ్డే అన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకు పంటలకు కనీస మద్దతుధర లభించేలా చట్టబద్ధత కల్పించినపుడే రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న వ్యవసాయ పథకాల గురించి మంత్రి నిరంజన్‌రెడ్డి ఆయనకు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని