పాపే మాకు ప్రాణం...!

కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో దత్తతలు పెరిగాయి. దత్తతలో ఆడపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన మాతృమూర్తులు సామాజిక దురాచారం, అసహాయ

Published : 23 May 2022 04:16 IST

దత్తతలో ఆడపిల్లలదే అగ్రస్థానం

కరోనాతో దేశీయ దంపతులకు ప్రాధాన్యం

ఏడాదిలో 169 మంది చిన్నారుల దత్తత

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో దత్తతలు పెరిగాయి. దత్తతలో ఆడపిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన మాతృమూర్తులు సామాజిక దురాచారం, అసహాయ పరిస్థితులు, పేదరికం, గృహహింస కారణంగా కన్నపేగు బంధాన్ని కాదనుకుని పుట్టిన వెంటనే వదిలేస్తుంటే.. పిల్లలు లేక ఆరాటపడుతున్న దంపతులు ఎక్కువగా ఆడపిల్లల్నే కోరుకుంటున్నారు. గత ఏడాది కాలంలో జరిగిన దత్తతల్లో మగ పిల్లలతో పోల్చితే ఆడపిల్లల సంఖ్య రెండింతలుగా ఉంది. మగపిల్లలు 53 మంది ఉంటే.. ఆడపిల్లలు 116 మంది ఉన్నారు. విదేశీ దంపతులకు దత్తత కింద వెళ్తున్నవారిలోనూ ఆడపిల్లలే ఎక్కువ.

ఆడపిల్లలకే ప్రేమ ఎక్కువ..!
పిల్లల్లేని దంపతులు అధికారికంగా దత్తత కోసం కేంద్రీయ దత్తత ఏజెన్సీ(కారా)కి దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాంటి వారి సామాజిక, ఆర్థిక, ఆరోగ్య తదితర పరిస్థితులు పరిశీలించి అనుమతిస్తున్నారు. అసహాయ స్థితుల్లో ఉన్న, రోడ్డుపై దొరికిన చిన్నారులు, అమ్మానాన్నలు లేని అనాథ పిల్లలను శిశు సంక్షేమ శాఖ అధికారులు చేరదీస్తున్నారు. వారిని పిల్లల సంరక్షణ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆమోదంతో స్వీయ సంరక్షణలోకి తీసుకుని హైదరాబాద్‌లోని శిశు విహార్‌తో పాటు జిల్లాల్లోని శిశు గృహల్లో పునరావాసం కల్పిస్తున్నారు. మూడేళ్లలోపు పిల్లల్ని ప్రత్యేక సంరక్షణలో పెడుతున్నారు. న్యాయప్రక్రియ అనంతరం పిల్లలు లేని దంపతులకు ‘కారా’ నిబంధనల ప్రకారం దత్తతకు అనుమతిస్తున్నారు. కారాలో దత్తతకు దరఖాస్తు చేసుకున్నవారికి సీనియారిటీ ప్రకారం అందుబాటులోని పిల్లల్ని దత్తత ఇస్తున్నారు. ఇందుకోసం దంపతులు కనీసం రెండేళ్ల నుంచి అయిదేళ్ల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఆడపిల్లల్ని కోరుకున్నవారికి ఒక్కోసారి రెండేళ్లలోపే అవకాశం వస్తోంది. రాష్ట్రంలో ఏటా దత్తతకు వెళ్తున్న, అసహాయ పరిస్థితుల్లో సంరక్షణ కేంద్రాలకు వస్తున్న ఆడపిల్లల సంఖ్య సమానంగా ఉంటోంది. ‘‘గతంలో మగ పిల్లల కోసం ఎక్కువగా వచ్చేవారు. ఇప్పుడు ఆడపిల్లలే కావాలని కోరుతున్నారు. తక్కువ సమయంలో పిల్లలు దత్తతకు వచ్చే అవకాశం ఉంటోంది. మరోవైపు ఆడపిల్లలకు తల్లిదండ్రులపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. చివరి క్షణాల్లో ప్రేమగా చూసుకుంటుందనే భావనతో ఆడపిల్లలే కావాలని కోరుకుంటున్నారు’’ అని శిశు సంక్షేమాధికారులు తెలిపారు. మగపిల్లలు కావాలనుకుంటే ఒక్కోసారి నాలుగేళ్లు పడుతోందని వివరించారు.

కరోనాతో తగ్గిన విదేశీ దత్తతలు...
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కారణంగా రెండేళ్లుగా విదేశీ దత్తతలు తగ్గాయి. దీంతో అందుబాటులోని పిల్లల్ని ‘కారా’ సీనియారిటీ ప్రకారం దేశీయ దంపతులకు దత్తత ఇచ్చారు. ఇటీవల అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఎత్తివేయడంతో విదేశీ దంపతులు కూడా దత్తత కోసం ఆరా తీస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని