వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడ?

ఏపీలో సంచలనంగా మారిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంత బాబు).. పూర్వ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎట్టకేలకు పోలీసులు ఎమ్మెల్సీని

Published : 23 May 2022 04:16 IST

అరెస్ట్‌ చేయకపోవడంపై అనుమానాలు

గతంలో ఆయనపై రౌడీషీట్‌..

జి.మామిడాడలో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి

ఈనాడు డిజిటల్‌-రాజమహేంద్రవరం: ఏపీలో సంచలనంగా మారిన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ (అనంత బాబు).. పూర్వ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎట్టకేలకు పోలీసులు ఎమ్మెల్సీని ప్రధాన నిందితుడిగా చేర్చారు. కలెక్టర్‌ ప్రత్యేక అనుమతితో శనివారం అర్ధరాత్రి పోస్టుమార్టం చేసి.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసు బందోబస్తు నడుమ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని అతని స్వగ్రామం పెదపూడి మండలం జి.మామిడాడకు తరలించి... అంత్యక్రియలు చేశారు. ఇప్పటికీ ఎమ్మెల్సీని అరెస్టు చేయకపోవటం అనుమానాలకు తావిస్తోంది.  శుక్రవారం నుంచి తన ఇద్దరు గన్‌మెన్లను వదిలి వెళ్లినట్లు పోలీసువర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా (ఏ-1) ఎమ్మెల్సీ పేరును సవరించిన ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఇందులో ఆయనతోపాటు మరికొందరు ఉన్నట్లు పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం ఉదంతంలో ఆరుగురు పాల్గొన్నారనీ.. వీరంతా వేరేచోట తలదాచుకున్నారని సమాచారం.

శనివారం అర్ధరాత్రి 1.30 గంటలకు వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేసి, నివేదికను పోలీసులకు ఇచ్చారు. తలపై రెండు గాయాలు, రెండు చేతులు విరిచిన ఆనవాళ్లు, ఒళ్లంతా తీవ్రంగా కవుకు గాయాలు, ఎడమ కాలు బొటనవేలు, కుడికాలు మడమ దగ్గర గాయాలు గుర్తించినట్లు తెలుస్తోంది. మర్మావయవం మీద కూడా  గాయాలైన ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం.

ఎమ్మెల్సీ అనంతబాబుపై గతం నుంచి నేరారోపణలు ఉన్నాయి. రంపచోడవరం పోలీసులు గతంలో రంగురాళ్ల కేసులో రౌడీషీట్‌ నమోదు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక  ఎత్తేశారు.

ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు
డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు బహిరంగంగా తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయకపోవడం బాధితుల అనుమానాలకు బలం చేకూర్చేలా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ఆదివారం సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను ఆయన ఫోన్లో పరామర్శించారు. తన భర్త హత్యకు అనంతబాబే కారణమని ఈ సందర్భంగా అపర్ణ ఆరోపించారు. తనను పోలీసులు తీవ్రంగా వేధించారని, ప్రభుత్వం ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిందని వాపోయారు. తన భర్త హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని