ఇండో-పసిఫిక్‌లో శాంతికి బాటలు వేద్దాం

అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులకు ఇండో-పసిఫిక్‌ ప్రాంతం కేంద్ర బిందువని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు భారత్‌ కొన్ని శతాబ్దాల పాటు ప్రధాన కేంద్రంగా కొనసాగిందని గుర్తుచేశారు.

Updated : 24 May 2022 09:22 IST

  ప్రధాని మోదీ ఉద్ఘాటన

  అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ ప్రాంతమే కేంద్ర బిందువని వ్యాఖ్య

  అమెరికా నేతృత్వంలో ఆర్థిక చట్రం ఆవిర్భావం

  సభ్య దేశంగా భారత్‌

టోక్యో: అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులకు ఇండో-పసిఫిక్‌ ప్రాంతం కేంద్ర బిందువని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు భారత్‌ కొన్ని శతాబ్దాల పాటు ప్రధాన కేంద్రంగా కొనసాగిందని గుర్తుచేశారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని ఇంజిన్‌గా మార్చాలన్న ఉమ్మడి లక్ష్యంతో ఆవిర్భవించిన ‘ఇండో-పసిఫిక్‌ ఆర్థిక చట్రం (ఐపీఈఎఫ్‌)’కు సమగ్ర రూపమిచ్చేందుకు తాము కృషిచేస్తామని ఉద్ఘాటించారు. తద్వారా ఇక్కడ శాంతి, సౌభాగ్యాలకు బాటలు పరుస్తామని భరోసా ఇచ్చారు. టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదలతో కలిసి ఐపీఈఎఫ్‌ ఆవిర్భావాన్ని ప్రకటించిన మోదీ.. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఐపీఈఎఫ్‌లో భారత్‌ భాగస్వామిగా చేరినట్లు తెలిపారు.

ఇండో-పసిఫిక్‌లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉమ్మడి, సృజనాత్మక పరిష్కార మార్గాలను కనుగొనాలని మోదీ పిలుపునిచ్చారు. విశ్వాసం (ట్రస్ట్‌), పారదర్శకత (ట్రాన్స్‌పరెన్సీ), సమయానుకూలత (టైమ్లీనెస్‌) అనే మూడు ‘టి’లను మూలస్తంభాలుగా చేసుకుంటూ సమర్థ సరఫరా గొలుసులను ఏర్పాటుచేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ‘‘ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు, తయారీ రంగం, ఆర్థిక కార్యకలాపాలకు ఇండో-పసిఫిక్‌ ప్రాంతమే కేంద్రం. ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలకు భారత్‌ శతాబ్దాల పాటు ప్రధాన కేంద్రంగా ఉందన్న వాస్తవాన్ని చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతన వాణిజ్య ఓడరేవు గుజరాత్‌లోని లోథాల్‌లో ఉంది’’ అని మోదీ పేర్కొన్నారు. ఐపీఈఎఫ్‌కు శ్రీకారం చుట్టినందుకు బైడెన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటూ ఉమ్మడి లక్ష్యాలను సాధించడంపై ఐపీఈఎఫ్‌ భాగస్వామ్య దేశాలు త్వరలోనే సంప్రదింపులు ప్రారంభిస్తాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, భారత్‌-అమెరికా సరికొత్త ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక ఒప్పందంపై సోమవారం సంతకాలు చేశాయి.

చైనా దూకుడుకు కళ్లెం వేసేలా..

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని 12 దేశాలతో ఉమ్మడి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఐపీఈఎఫ్‌కు అమెరికా రూపకల్పన చేసింది. అమెరికాతో పాటు భారత్‌, ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండోనేసియా, జపాన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, మలేసియా, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, థాయిలాండ్‌, వియత్నాం ఇందులో సభ్యదేశాలు. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వీటి వాటా దాదాపు 40%. ఆయా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు ఐపీఈఎఫ్‌ దోహదపడనుంది. కొవిడ్‌ మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వంటి ఒడుదొడుకులను అధిగమించి తిరిగి స్థిరత్వాన్ని సాధించేందుకు.. ఆర్థిక రంగంలో భవిష్యత్‌ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడనుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసే బలమైన ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఐపీఈఎఫ్‌కు అమెరికా శ్రీకారం చుట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మాంద్యం అనివార్యమేమీ కాదు: బైడెన్‌

అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం పలు సమస్యలు పీడిస్తున్న మాట వాస్తవమేనని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. అయితే తమ దేశంలో ఆర్థిక మాంద్యం అనివార్యమేమీ కాదని.. పలు ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. ఐపీఈఎఫ్‌తో సభ్యదేశాలకు అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు- అమెరికా, ఐరోపా దేశాల్లో ప్రమాదకర మంకీపాక్స్‌ వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పటికీ.. కొవిడ్‌ తరహాలో కఠిన క్వారంటైన్‌ ఆంక్షలు విధించాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదని అభిప్రాయపడ్డారు. టోక్యోలో విలేకర్ల సమావేశంలో ఈ మేరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని