తెలంగాణకు లులూ

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తొలిరోజు పలు ప్రసిద్ధ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన లులూ

Updated : 24 May 2022 10:01 IST

రూ. 500 కోట్లతో ఆహారశుద్ధి పరిశ్రమ స్థాపనకు అంగీకారం

రూ. వంద కోట్లతో కిమో ఫార్మా విస్తరణ

స్విట్జర్లాండ్‌ బ్యాంకింగ్‌, బీమా సంస్థ స్విస్‌రే పెట్టుబడి

హైదరాబాద్‌లో ఈ-కామర్స్‌ సంస్థ మీషో కార్యాలయం

దావోస్‌లో తొలిరోజు నాలుగు సంస్థలతో ఒప్పందాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తొలిరోజు పలు ప్రసిద్ధ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన లులూ గ్రూపు రూ.500 కోట్లతో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. స్పెయిన్‌కు చెందిన కీమోఫార్మా రూ.100 కోట్లతో తమ రెండో భారీ పరిశ్రమ ఏర్పాటును ప్రకటించింది. స్విట్జర్లాండ్‌ బ్యాంకింగ్‌, బీమా సంస్థ స్వీస్‌రే హైదరాబాద్‌లో తమ కార్యాలయ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ-కామర్స్‌ సంస్థ మీషో కూడా రాష్ట్ర రాజధానిలో కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. వాటిని మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి వాణిజ్య సముదాయం: లులూ సంస్థ

మంత్రి కేటీఆర్‌ను లులూ సంస్థ అధిపతి యూసుఫ్‌అలీ కలిసి ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు నిర్ణయాన్ని తెలిపి, ప్రణాళిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అనుమతి పత్రాలను ఆయనకు అందజేశారు. మొదటి యూనిట్‌ పనులు చేపట్టిన వెంటనే రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేస్తామని ఈ సందర్భంగా యూసుఫ్‌అలీ తెలిపారు. తెలంగాణ నుంచి యూరప్‌ దేశాలకు శుద్ధిచేసిన ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో అద్భుత వాణిజ్య సముదాయం నిర్మిస్తామన్నారు. 

* స్పానిష్‌ బహుళజాతి సంస్థ కీమోఫార్మా పరిశోధన అభివృద్ధి డైరెక్టర్‌ జీన్‌ డానియల్‌ బోనీ కేటీఆర్‌ను కలిసి రూ.100 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో రెండో ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. తమ సంస్థ 2018 నుంచి జీనోమ్‌ వ్యాలీలో రూ.170 కోట్ల పెట్టుబడితో.. 270 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగిస్తోందన్నారు. 

* 160 సంవత్సరాల చరిత్రగల స్విట్జర్లాండ్‌ బ్యాంకింగ్‌, ఆర్థిక నిర్వహణ, బీమా సంస్థ స్విస్‌ రే హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పింది. 250 మందికి ఉపాధి కల్పిస్తామని, దశలవారిగా విస్తరిస్తామని ప్రకటించింది. సంస్థ ఎండీ వెరోనికా స్కాట్టి, ప్రభుత్వ సంస్థల విభాగం డైరెక్టర్‌ ఇవో మెంజింగ్నర్‌ దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమై తమ నిర్ణయాన్ని తెలిపారు.హైదరాబాద్‌ కార్యాలయం ద్వారా తమ సంస్థ డాటా మరియు డిజిటల్‌ విభాగాలను బలోపేతం చేయడం, బీమా ఉత్పత్తులను రూపొందించడం, విపత్తుల నివారణ వంటి అంశాలపై పనిచేస్తుందన్నారు. నూతన ఆవిష్కరణల కోసం టీహబ్‌ భాగస్వామ్యం తీసుకుంటామన్నారు. 

మీషోతో కార్యకలాపాలు

భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్‌ సంస్థ మీషో వ్యవస్థాపకుడు విదిత్‌ ఆత్రే మంత్రి కేటీఆర్‌ ఆహ్వానం మేరకు హైదరాబాద్‌లో తమ కార్యాలయ ఏర్పాటుకు అంగీకరించి ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా తెలంగాణలోని ద్వితీయశ్రేణి నగరాల్లో రిటైల్‌ వ్యాపారులకు సేవలందిస్తామని తెలిపారు. అంతకుముందు  కేటీఆర్‌ను విదిత్‌ ఆత్రేతో పాటు మరో యువ సంచలనం నితిన్‌ కామత్‌  (ఆన్‌లైన్‌ స్టాక్‌ మార్కెటింగ్‌ బ్రోకరింగ్‌ సంస్థ)లు కలిశారు. వారి అనుభవాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చి యువతకు స్ఫూర్తినివ్వాలని కోరారు. ఈ సమావేశాల్లో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్‌, సీఆర్‌వో అమర్‌నాథ్‌రెడ్డిలు పాల్గొన్నారు.

తెలంగాణ పెవిలియన్‌ ప్రారంభం

దావోస్‌ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో జపాన్‌కు చెందిన ష్యుజిత్సు సంస్థ సీఈవో తకహితో తొకిట,  బ్రిటిష్‌ మైక్రోబయాలజిస్టు పీటర్‌ పియోట్‌ తదితరులు పాల్గొన్నారు. పవర్‌ పాయింటు ప్రజెంటేషన్‌ ద్వారా తెలంగాణ విధానాలను కేటీఆర్‌ వారికి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని