గడువులోగా బియ్యం ఇవ్వని మిల్లులపై నిషేధం

గడువులోగా బియ్యం ఇవ్వని మిల్లులకు భవిష్యత్తులో ధాన్యం ఇచ్చేది లేదని, వాటిపై నిషేధం విధించి.. ఆయా యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 24 May 2022 05:07 IST

పౌరసరఫరాల సంస్థ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌ : గడువులోగా బియ్యం ఇవ్వని మిల్లులకు భవిష్యత్తులో ధాన్యం ఇచ్చేది లేదని, వాటిపై నిషేధం విధించి.. ఆయా యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ధాన్యం తీసుకునేందుకు పూచీకత్తు ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 2019-20 యాసంగి సీజనుకు సంబంధించిన బియ్యం ఇచ్చేందుకు ఎఫ్‌సీఐ ఈ నెల 31వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇంకా 5.47 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. గడువు పొడిగించి 20 రోజులు దాటుతున్నా మిల్లర్ల నుంచి ఆశించినంత స్పందన లేదని ఆ ఉత్తర్వుల్లో పౌరసరఫరాల సంస్థ పేర్కొంది. 2019-20 యాసంగిలో 92.34 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లులకు పంపింది. వాటి నుంచి 62.60 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యానికి గాను మిల్లర్లు ఇప్పటి వరకు 57.13 లక్షల మెట్రిక్‌ టన్నులు ఎఫ్‌సీఐకి ఇచ్చారు. మరోదఫా గడువు పొడిగించే అవకాశం ఉండదని అధికారులు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆ గడువులోగా ఇవ్వని బియ్యాన్ని కేంద్ర కోటా(సెంట్రల్‌ పూల్‌) నుంచి తొలగిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం పడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని