క్రిమినల్‌ కేసులున్నా.. కోర్టు ఆదేశాలతో పాస్‌పోర్టు ఇవ్వొచ్చు

క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి.. సంబంధిత కోర్టు ఆదేశాలతో నిర్దిష్ట కాలానికి పాస్‌పోర్టు జారీ చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కె.రేవతి అనే మహిళ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.సురేందర్‌ ఇటీవల విచారణ చేపట్టారు.

Published : 24 May 2022 04:55 IST

హైకోర్టు ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి.. సంబంధిత కోర్టు ఆదేశాలతో నిర్దిష్ట కాలానికి పాస్‌పోర్టు జారీ చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కె.రేవతి అనే మహిళ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.సురేందర్‌ ఇటీవల విచారణ చేపట్టారు. అమెరికాలో ఎంఎస్‌ చదువుతున్న తన కుమార్తె డిగ్రీ ప్రదాన కార్యక్రమానికి వెళ్లడానికి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసినా సదరు కార్యాలయం జారీ చేయలేదని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పాస్‌పోర్టు జారీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆమెపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసు విషయాన్ని తొక్కిపెట్టారని, అందుకే దరఖాస్తును పక్కన పెట్టారని కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వరరావు వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి 1993 నోటిఫికేషన్‌ ప్రకారం క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నపుడు సంబంధిత న్యాయస్థానం పాస్‌పోర్టు జారీకి ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు. పిటిషనర్‌కు రెండేళ్ల గడువుతో పాస్‌పోర్టు జారీ చేయాలని  ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మంజూరయ్యాక పాస్‌పోర్టును కోర్టుకు సమర్పించాలని, ప్రయాణానికి ముందు దరఖాస్తు చేసుకుని తీసుకోవాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి స్పష్టం చేశారు. పాస్‌పోర్టు నిమిత్తం పిటిషనర్‌ పెట్టుకునే దరఖాస్తును రెండు రోజుల్లో పరిష్కరించాలని కింది కోర్టును ఆదేశిస్తూ విచారణను ముగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని