ఎమ్మెల్యే అండతో నా ఇల్లు కబ్జా చేశారు

బోథ్‌ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు అండతో ఇచ్చోడలోని తన ఇంటిని యాకుబ్‌ అనే వ్యక్తి కబ్జా చేశారని జవాను మహ్మద్‌ అక్రమ్‌ ఆరోపించారు. ఈమేరకు జాతీయజెండాను చేతబట్టి ఆర్మీ దుస్తులు ధరించి ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో

Published : 24 May 2022 04:55 IST

ప్రజావాణిలో జవాను ఫిర్యాదు

ఆదిలాబాద్‌, బోథ్‌-న్యూస్‌టుడే: బోథ్‌ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు అండతో ఇచ్చోడలోని తన ఇంటిని యాకుబ్‌ అనే వ్యక్తి కబ్జా చేశారని జవాను మహ్మద్‌ అక్రమ్‌ ఆరోపించారు. ఈమేరకు జాతీయజెండాను చేతబట్టి ఆర్మీ దుస్తులు ధరించి ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి విభాగానికి వచ్చారు. అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌కు అర్జీని అందించి తన గోడును వివరించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇదే విషయమై సదరు ఎమ్మెల్యేను సంప్రదిస్తే ఇంటిని ఇద్దరూ చెరిసగం పంచుకోవాలని, లేదంటే ఆ ఇల్లు కూడా దక్కదని తనను బెదిరించే యత్నం చేశారని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులు ప్రస్తుతం బోథ్‌లో ఉంటున్నారని తెలిపారు. ఇచ్చోడలో ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించి కబ్జా చేశారన్నారు. తాను పుల్వామా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశరక్షణ కోసం పనిచేస్తున్న తాను సొంత ఇంటిని రక్షించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జవానుకు విశ్రాంత ఆర్మీ జవాన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌, బోథ్‌ మండల నాయకుడు చంటి సంఘీభావం తెలిపారు.

ఆ వ్యక్తితో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే

జవాను ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేసిన విషయంమై ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. యాకూబ్‌ అనే వ్యక్తితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అతను తమ కార్యకర్త కూడా కాదని స్పష్టం చేశారు. ఇంటిని కబ్జా చేయించే అవసరం తనకు లేదని, అలాంటపుడు తానెందుకు పంచాయితీ చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని