పదో తరగతి పరీక్షలు ప్రారంభం

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రథమ భాష పరీక్షకు 5,08,143 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 5,03,041 (99 శాతం) మంది రాశారు

Published : 24 May 2022 04:55 IST

కోదాడలో మారిన ప్రశ్నపత్రం

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే-కోదాడ పట్టణం, ఆసిఫాబాద్‌ అర్బన్‌: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రథమ భాష పరీక్షకు 5,08,143 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 5,03,041 (99 శాతం) మంది రాశారు. ప్రైవేటు విద్యార్థులు 158 మందికి గాను 89 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలి రోజు మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని, పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఓ పేపర్‌ బదులు మరొకటి..

సూర్యాపేట జిల్లా కోదాడలోని 11 కేంద్రాల్లో పదో తరగతి విద్యార్థులకు వారు చదివిన సబ్జెక్టు బదులు మరో ప్రశ్నపత్రం ఇచ్చారు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన 35 మందిని మరో కార్పొరేట్‌ స్కూల్‌ విద్యార్థులుగా నామినల్‌ రోల్స్‌లో నమోదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ సమయంలో వారి సబ్జెక్టుల్లో తెలుగు బదులు ‘కాంపోజిట్‌ తెలుగు’ అని గుర్తించారు. హాల్‌టికెట్లలోనూ అదే సబ్జెక్టు నమోదైంది. పరీక్ష కేంద్రంలో అధికారులు కాంపోజిట్‌ పేపర్‌ను ఇవ్వడంతో విద్యార్థులు వారి దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని కేంద్రాల్లో విద్యార్థుల నుంచి హామీపత్రం తీసుకొని తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారు. మరికొన్ని కేంద్రాల్లో కాంపోజిట్‌ పరీక్ష రాశారు. విద్యార్థుల హాల్‌టికెట్‌లలో నమోదైన ప్రశ్నపత్రాన్నే అధికారులు ఇచ్చారని, వారి తప్పేమీ లేదని కోదాడ ఎంఈవో సలీమ్‌ షరీఫ్‌ తెలిపారు.

ఇద్దరు చీఫ్‌ సూపరింటెండెంట్లకు మెమోలు

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్ల(సీఎస్‌)కు డీఈవో అశోక్‌ సోమవారం మెమోలు జారీ చేశారు. అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి ఉదయం 8.50 గంటలకు సందర్శించిన సమయంలో పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు, పోషకులు, సిబ్బంది మొబైల్‌ ఫోన్లు తీసుకువచ్చారన్నారు. దీనికి సీఎస్‌ల బాధ్యతారాహిత్యమే కారణమని పేర్కొంటూ మెమోలు జారీ చేసినట్లు డీఈవో పేర్కొన్నారు.


విధికి ఎదురీది.. ‘పది’ పరీక్షలకు కదిలి

సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలకు చెందిన నందు-సంతోషి దంపతుల కుమార్తె మానసకు విధి కన్నెర్రతో పెద్ద కష్టమొచ్చి పడింది. నాలుగేళ్ల క్రితం ప్రమాదవశాత్తు కింద పడటంతో కాళ్లు, నడుము విరిగాయి. రూ.2 లక్షల వరకు అప్పు చేసి చికిత్స చేయించినా.. నయం కాలేదు. మంచానికే పరిమితమైంది. ఆమె పరిస్థితిపై 2018 ఏప్రిల్‌ 8న ‘ఈనాడు’లో ‘చదువుల తల్లిని బతికించండి సారూ’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో దాతలు స్పందించారు. విన్నర్‌ ఫౌండేషన్‌ సభ్యులు రూ.2 లక్షల వరకు వెచ్చించి హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం ఆమె చక్రాల కుర్చీ సాయంతో చేర్యాల జిల్లా పరిషత్‌ పాఠశాలలో తరగతులకు హాజరై.. 9, 10 తరగతులు పూర్తి చేసింది. సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు కందిలోని ఉర్దూ పాఠశాల పరీక్ష కేంద్రానికి చక్రాల కుర్చీలోనే తోటి విద్యార్థులతో పాటు వచ్చింది.

- ఈనాడు, సంగారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు