గైర్హాజరయ్యే వైద్యులపై వేటు

రాష్ట్రంలో అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న వైద్యులను సర్వీసు నుంచి తొలగించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా సెలవుల్లో వెళ్లిన వైద్యుల జాబితా రూపొందించాలని తన

Published : 24 May 2022 04:55 IST

రాష్ట్రవ్యాప్తంగా జాబితా రూపొందించి షోకాజ్‌ నోటీసులు ఇవ్వండి: మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న వైద్యులను సర్వీసు నుంచి తొలగించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా సెలవుల్లో వెళ్లిన వైద్యుల జాబితా రూపొందించాలని తన శాఖ అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా సమీక్ష సందర్భంగా షాద్‌నగర్‌, హయత్‌నగర్‌ సహా వివిధ ఆసుపత్రుల్లో వైద్యులు అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా అలాంటి వారిని గుర్తించి ముందుగా షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని, స్పందించని వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని మంత్రి ఆదేశించారు. అలా ఏర్పడిన ఖాళీలలో యువతకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. హయత్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో 38 మంది ఉద్యోగులు ఉండగా.. 39 మంది రోగులు వస్తున్నారని పేర్కొన్నారు. వారికి ఇచ్చే జీతాలతో కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించవచ్చన్నారు. ‘‘రాజేంద్రనగర్‌లో మూడు డెలివరీలు అవుతున్నాయి. రేడియాలజిస్టు ఉన్నారు.. కొండాపూర్‌ ఆసుపత్రిలో 250 ప్రసవాలు అవుతుంటే.. రేడియాలజిస్టు లేరు. ఇలాంటి పరిస్థితి వైద్య ఆరోగ్య శాఖలో ఉంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పీహెచ్‌సీ వైద్యులు తమ విధులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో త్వరలో 13,000 వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.

కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రి వైద్యాధికారిపై ఆగ్రహం

రాయదుర్గం, న్యూస్‌టుడే: డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.500 డిమాండ్‌ చేసిన కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రి వైద్యాధికారిపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడిని వైద్యాధికారి వద్దకు తీసుకొచ్చిన సెక్యూరిటీ గార్డు ద్వారా విచారించి.. శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో మంత్రి సోమవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం రాగా.. డా.మూర్తి అనే వైద్యాధికారి తనను రూ.500 అడిగారని, తాను రూ.200 ఇస్తానన్నట్లు ఓ బాధితుడు మంత్రికి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని