Published : 24 May 2022 05:50 IST

‘పోలవరం ఎత్తిపోతల’ చేపట్టకుండా చూడండి

 గోదావరి బోర్డుకు తెలంగాణ లేఖ

పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను నిలిపివేయించాలంటూ కృష్ణా బోర్డుకు..

ఈనాడు హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తీసుకొనేలా ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. అలాగే పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను నిలిపివేయించాలంటూ కృష్ణా బోర్డును కోరింది. ఆయా బోర్డుల ఛైర్మన్లకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్సీ) మురళీధర్‌ సోమవారం లేఖలు రాశారు. గత ఏడాది నవంబరులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సమావేశంలో దీనిపై జరిగిన చర్చలో డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని మళ్లించేలా ఎత్తిపోతల నిర్మించడానికి వీల్లేదని, కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందని తేల్చిచెప్పారన్నారు. తర్వాత అధికారులు పరిశీలనకు వెళ్లినపుడు పనులు జరుగుతుండటం చూసి నిలిపివేయాలని గోదావరి బోర్డు ఆదేశించినట్లు పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు చేపట్టాలని నిర్ణయించుకోవడం సరికాదని, ప్రతిపాదిత ఎత్తిపోతల చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ దిగువన విస్తరణకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలిచి రూ.6164 కోట్ల పనులు చేపట్టనుందంటూ ఆ వివరాలను కృష్ణా బోర్డుకు సమర్పించారు. పోతిరెడ్డిపాడు దిగువన నిప్పులవాగు, ఎస్కేప్‌ ఛానల్‌, బనకచెర్ల హెడ్‌రెగ్యులేటర్‌, ఇతర కాలువలను విస్తరించేందుకు 2020 జూన్‌ 15న జీవో 388 జారీ చేసిందన్నారు. దీనిపై అప్పుడే కృష్ణా బోర్డుకు, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో మార్పులు చేయాలని కూడా కోరామన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలు మాత్రమే తీసుకోవాల్సి ఉందని, దీనికే పరిమితం చేయాలని లేఖలో ఈఎన్సీ కోరారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని