రూ.500 కోట్లతో పైపుల పరిశ్రమ

బెల్జియంకు చెందిన అలియాక్సిస్‌ సంస్థ తెలంగాణలో రూ. 500 కోట్లతో పైపులు, ఇతర ప్లాస్టిక్‌ ఉత్పత్తుల భారీ పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించింది. దీని ద్వారా 500 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో

Published : 25 May 2022 05:38 IST

రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకొచ్చిన అలియాక్సిస్‌
కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం
నొవార్టిస్‌ విస్తరణ ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: బెల్జియంకు చెందిన అలియాక్సిస్‌ సంస్థ తెలంగాణలో రూ. 500 కోట్లతో పైపులు, ఇతర ప్లాస్టిక్‌ ఉత్పత్తుల భారీ పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించింది. దీని ద్వారా 500 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, అలియాక్సిస్‌ కంపెనీ సీఈవో కోయిన్‌ స్టికర్‌ దీనిపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్టికర్‌ మాట్లాడుతూ, భారత్‌లో అతిపెద్ద పైపుల మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని తాము భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలోని అత్యుత్తమ విధానాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. దేశీయ మార్కెట్‌తో పాటు ఎగుమతుల కోసం అంతర్జాతీయ స్థాయి ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తెలంగాణలో తయారు చేస్తామని చెప్పారు. ‘ఆశీర్వాద్‌’ పేరుతో పైపులను ఉత్పత్తి చేయనున్న ఈ సంస్థకు అన్ని విధాలా సహకరిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

నొవార్టిస్‌ రెండో అతిపెద్ద కార్యాలయం
భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళజాతి కంపెనీల్లోకెల్లా హైదరాబాద్‌లోని తమ సామర్థ్య కేంద్రం అతి పెద్దది అని ప్రసిద్ధ ఔషధ సంస్థ నొవార్టిస్‌ సీఈవో వసంత్‌ నరసింహన్‌ తెలిపారు. దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయిన ఆయన తెలంగాణలో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. స్విట్జర్లాండ్‌ బాసెల్‌లోని తమ కేంద్ర కార్యాలయం తర్వాత సుమారు తొమ్మిది వేల మంది ఉద్యోగులతో హైదరాబాద్‌ కేంద్రమే పెద్దదని వివరించారు. దీన్ని తమ కృత్రిమ మేధ, డేటా, డిజిటల్‌ కార్యక్రమాలకు ఆసియా పసిఫిక్‌ కేంద్రంగా ఎంచుకుని విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్‌ సంస్థ హెచ్‌సీఎల్‌ ఎండీ విజయ్‌ గుంటూరు కేటీఆర్‌ను కలిసి తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో తమ కేంద్రాలను విస్తరిస్తామని తెలిపారు. భారతి ఎయిర్‌టెల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతి మిత్తల్‌, వైస్‌ ఛైర్మన్‌, ఎండీ రాజన్‌ భారతి మిత్తల్‌ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్త డేటా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ వారిని కోరారు. విద్య, వైద్య రంగాల్లో డిజిటలైజేషన్‌కు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని డెలాయిట్‌ సీఈవో పునీత్‌ రంజన్‌ ఆసక్తి వ్యక్తం చేశారు. టెలికాం ఉత్పత్తుల సంస్థ ఎన్‌ఈసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరిహికో ఇషిగురు, భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ డిప్యూటీ ఎండీ అమిత్‌ కల్యాణిలు మంత్రిని కలిసి తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపారు.

సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో భేటీ
తెలంగాణ ప్రభుత్వం పర్యావరణానికి పెద్దపీట వేస్తోందని, హరితహారం కార్యక్రమం ద్వారా తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రపంచంలోనే భారీఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టారని కేటీఆర్‌ తెలిపారు. భారతదేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైందని అన్నారు. దావోస్‌లో తెలంగాణ పెవిలియన్‌కు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను కేటీఆర్‌ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సద్గురు చేపట్టిన భూసార పరిరక్షణ (సేవ్‌ ద సాయిల్‌) అద్భుత కార్యక్రమమంటూ మద్దతు తెలిపారు. రైతుల ఆదాయం పెంపునకు చేపట్టిన కార్యక్రమాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సద్గురు తెలిపారు.

సాంకేతికత పదునైన కత్తి..
కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌ చైన్‌, డాటా సైన్సెస్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివని, వాటి వల్ల కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు అవగాహన ఉండాలని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కృత్రిమమేధపై జరిగిన చర్చాగోష్ఠిలో మంత్రి ప్రసంగించారు. ‘ఫేషియల్‌ రికగ్నిషన్‌, కృత్రిమమేధ విస్తృత ఉపయోగానికి ప్రజల విశ్వాసం పొందడమే ప్రభుత్వాలకు అసలైన సవాల్‌. సాంకేతికతల వినియోగంపై ప్రభుత్వ విభాగాలకు ఉండాల్సిన నియంత్రణ, అధికారాలను స్పష్టంగా నిర్దేశించినప్పుడే ఇది సాధ్యమవుతుంది’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని