Published : 25 May 2022 05:09 IST

మెరికల నెలవు ఐఎస్‌బీ

అంతర్జాతీయంగా గుర్తింపు
యాజమాన్య కోర్సుల శిక్షణలో అత్యున్నత ప్రమాణాలు
ఇక్కడి విద్యార్థులకు  ప్రముఖ సంస్థల్లో పెద్దస్థాయి ఉద్యోగాలు
రేపు ద్విదశాబ్ది వార్షికోత్సవం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచంలోని అగ్రశ్రేణి 50 బిజినెస్‌ స్కూళ్లలో ఒకటిగా నిలిచిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ఈ నెల 26న 20 ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ విద్యాసంస్థ ఏటా వందల మందికి అత్యున్నత స్థాయి యాజమాన్య కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. భారత్‌తో పాటు, వివిధ దేశాలకు చెందిన మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు తమ కలల సాధనకు ఐఎస్‌బీని ఎంచుకుంటున్నారు. ఇక్కడ చదివిన వారు..ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వివిధ అంశాలపై లోతైన పరిశోధనలు, ఎంతో అనుభవం ఉన్న ఆచార్యుల బోధనలే ఐఎస్‌బీని ప్రపంచ అగ్రశ్రేణి బి-స్కూళ్లలో ఒకటిగా నిలబెట్టాయి.
అంతర్జాతీయ స్థాయిలో మేనేజ్‌మెంట్‌ శిక్షణ అందించే ఒక అత్యున్నత స్థాయి బిజినెస్‌ స్కూల్‌ను దేశీయంగా ఏర్పాటు చేయాలనే అలోచనతో మెకెన్సీ అండ్‌ కంపెనీ చీఫ్‌ రజత్‌ గుప్తాతో పాటు రాహుల్‌ బజాజ్‌, ముకేశ్‌ అంబానీ, ఆది గోద్రెజ్‌లాంటి ప్రముఖుల సంయుక్త ఆలోచనతో ఆవిర్భవించిందే ఈ ఐఎస్‌బీ. ఎప్పటికప్పుడు మారుతున్న వ్యాపారాలకు నాయకత్వం వహించేందుకు యువతను సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైంది.

1995లో బీజం
పరిశ్రమల అవసరాలు, విద్యాసంస్థల కోర్సులకు మధ్య ఉన్న అంతరాలను తొలగించేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకునే ఆలోచనకు 1995లో బీజం పడింది. 1997లో ఐఎస్‌బీ బోర్డు ఏర్పాటైంది. తొలుత ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాలను బోర్డు పరిశీలించింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు చొరవతో హైదరాబాద్‌లో నెలకొల్పాలని నిర్ణయించారు. 1999 డిసెంబరు 20న భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగ్గా, 2001 డిసెంబరు 2న అప్పటి ప్రధాని వాజ్‌పేయీ చేతుల మీదుగా ప్రారంభమైంది. 2010 ఆగస్టులో మొహాలీ క్యాంపస్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

128 మందితో ప్రారంభమై..
ఐఎస్‌బీ 128 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ఈ సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2022లో హైదరాబాద్‌, మొహాలీ క్యాంపస్‌లలో కలిపి 933మంది ఉన్నారు. ఇందులో 603 మంది హైదరాబాద్‌లో, 330 మంది మొహాలీ క్యాంపస్‌లో ఉన్నారు. ఇప్పటివరకు ఐఎస్‌బీ నుంచి దాదాపు 14,500 మంది విద్యార్థులు వివిధ కోర్సులను పూర్తి చేశారు. వేర్వేరు అంశాలతో 11 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీపీఎం) అత్యంత ఆదరణ పొందింది. ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక కోర్సులనూ నిర్వహిస్తోంది. అంకురాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఐవెంచర్స్‌, అటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ లాంటివీ ఉన్నాయి.

అత్యధిక ప్యాకేజీలు
ఐఎస్‌బీలో మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసిన వారికి అత్యధిక ప్యాకేజీలతో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. పీజీపీఎం పూర్తి చేసిన వారికి సగటున రూ.32 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. ఆసియాలోని బిజినెస్‌ స్కూళ్లలో నాలుగో స్థానంలో నిలిచిన ఐఎస్‌బీ పరిశోధనల్లో భారత్‌లో తొలి స్థానంలో నిలిచింది.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని