రోజుకు రెండు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

‘రాష్ట్రంలో రోజుకు ఒకటిన్నర నుంచి రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. కొనుగోళ్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వచ్చే నెల పదో తేదీ నాటికి సింహభాగం కొనుగోళ్లు

Published : 25 May 2022 05:15 IST

మంత్రి కమలాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో రోజుకు ఒకటిన్నర నుంచి రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల చొప్పున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. కొనుగోళ్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వచ్చే నెల పదో తేదీ నాటికి సింహభాగం కొనుగోళ్లు పూర్తవుతాయని అంచనా వేస్తున్నాం’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు 4లక్షల మంది రైతుల నుంచి సుమారు రూ.6వేల కోట్ల విలువ చేసే 30.09 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన ధాన్యంలో ఇప్పటికే 10వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. కొనుగోళ్లు సాఫీగా సాగుతుండటాన్ని ఓర్వలేని ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయి. కేంద్రం నుంచి సహకారం లేకపోగా క్షేత్రస్థాయి తనిఖీ పేరుతో ఎఫ్‌సీఐ ఇబ్బందులు పెడుతున్నా.. కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగుతోంది. ఇప్పటివరకు 11.64 కోట్ల గోనె సంచులను సమీకరించుకున్నాం. వాటిలో 7.52 కోట్ల సంచులను వినియోగించాం. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం తదితర జిల్లాల్లో వచ్చే వారం నాటికి కొనుగోళ్లు పూర్తవుతాయి. సుమారు రూ.3వేల కోట్ల భారం పడుతున్నా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోంది’ అని మంత్రి కమలాకర్‌ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని