కృత్రిమ అవయవాలతో కొత్త జీవితం!

మహబూబాబాద్‌కు చెందిన ఓ మహిళ(26)కు కుడిచేతి భుజం వద్ద తరచూ నొప్పి, వాపు లాంటి లక్షణాలు కనిపించాయి. వైద్యుల సూచనల మేరకు ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సంప్రదించారు. వివిధ

Updated : 26 May 2022 13:02 IST

ఎముకల క్యాన్సర్‌కు ఆధునిక వైద్యం

రూ.లక్షల సేవలు ఉచితంగానే
ఎంఎన్‌జేలో ఇప్పటికే 70 వరకు చికిత్సలు

ఈనాడు, హైదరాబాద్‌

*మహబూబాబాద్‌కు చెందిన ఓ మహిళ(26)కు కుడిచేతి భుజం వద్ద తరచూ నొప్పి, వాపు లాంటి లక్షణాలు కనిపించాయి. వైద్యుల సూచనల మేరకు ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సంప్రదించారు. వివిధ పరీక్షల అనంతరం ఆమెకు ఎముకల క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధరించారు. చికిత్సకు రూ.4-5 లక్షల వ్యయం అవుతుందని చెప్పారు. భుజం వరకు చెయ్యి తొలగించాల్సి ఉంటుందన్నారు. దీంతో ఆమె నిస్పృహ చెందారు. అంత డబ్బులు పెట్టలేక రెడ్‌హిల్స్‌లోని ప్రభుత్వ ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో సంప్రదించారు. అక్కడి వైద్యులు ఆమెకు చెయ్యి తొలగించకుండానే శస్త్రచికిత్స చేశారు. కృత్రిమ ఎముకను అమర్చి ఆమె జీవితంలో కొత్త వెలుగులు నింపారు. ప్రైవేటులో రూ. లక్షలు ఖర్చయ్యే చికిత్సను ఉచితంగా అందించారు.  

*సిద్దిపేటకు చెందిన మరో వ్యక్తి(40) కుడి మోకాలికి క్యాన్సర్‌ సోకింది. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎంఎన్‌జే ఆసుపత్రిలో సంప్రదించారు. పరిశీలించిన వైద్యులు క్యాన్సర్‌ సోకిన ఎముక భాగాన్ని తొలగించి కృత్రిమ అవయవం ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల్లోనే రోగి కోలుకున్నారు. ఇలా ఎంతోమంది పేద రోగుల జీవితాలకు ఎంఎన్‌జే ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యులు ఊరట కలిగిస్తున్నారు.

ఇప్పటివరకు 70కి పైనే చికిత్సలు

భుజం, చెయ్యి, కాలు తదితర భాగాల్లో ఎముకలకు క్యాన్సర్‌ సోకితే కొన్నిసార్లు వాటిని తొలగించాల్సి ఉంటుంది.

శరీరంలోని ఇతర భాగాల క్యాన్సర్‌ సోకినా, అది ముదిరి.. ఎముక క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. చెయ్యి, కాలి ఎముకకు క్యాన్సర్‌ సోకితే.. ఆ భాగాన్ని తొలగించి కృత్రిమ అవయవం (ఇంప్లాంట్స్‌) ఏర్పాటు చేయాలి. ఇలాంటి కృత్రిమ భాగాలను ప్రత్యేకంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి.

నెలకు 2-3 ఎముకల క్యాన్సర్‌ కేసులకు ఎంఎన్‌జే వైద్యులు ఆధునిక చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 70 వరకు ఈ తరహా చికిత్సలు అందించారు. ఇటీవలే ఓ మహిళకు సంక్లిష్ట సర్జరీ చేశామని డాక్టర్‌ ఉమాకాంత్‌, డాక్టర్‌ ముస్తఫా, డాక్టర్‌ సివేందర్‌, డాక్టర్‌ కిషన్‌ తెలిపారు.


నిర్లక్ష్యం వద్దు.. ముందే గుర్తించాలి
- డాక్టర్‌ జయలత, డైరెక్టర్‌, ఎంఎన్‌జే

చెయ్యి, కాలి ఎముక క్యాన్సర్లకు చికిత్సలు సంక్లిష్టమైనవి. ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. అయినా రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నాం. ఏ క్యాన్సర్‌ అయినా ముందే గుర్తించి చికిత్స తీసుకోవాలి. ఎముకలు, కీళ్లలో వాపు, తీవ్రమైన నొప్పి, సులువుగా విరిగిపోవడం, పగుళ్లు ఏర్పడటం, బరువు కోల్పోవటం, జ్వరం, అలసట, రక్తహీనత లాంటి లక్షణాలు ఉంటే ఎముక క్యాన్సర్లుగా అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి. వెంటనే చికిత్స తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని