స్వయం ఉపాధికి చేయూత కరవు

రాష్ట్రంలో బలహీనవర్గాలు, వెనుకబడిన తరగతుల యువత స్వయం ఉపాధికి ప్రభుత్వ ఆసరా కరవైంది. సంక్షేమ కార్పొరేషన్లకు దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా, రాయితీ రుణాలు మంజూరు కావడం లేదు. కరోనా తదితర

Updated : 26 May 2022 06:39 IST

మంజూరు కాని రాయితీ రుణాలు
9 లక్షల మంది ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బలహీనవర్గాలు, వెనుకబడిన తరగతుల యువత స్వయం ఉపాధికి ప్రభుత్వ ఆసరా కరవైంది. సంక్షేమ కార్పొరేషన్లకు దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా, రాయితీ రుణాలు మంజూరు కావడం లేదు. కరోనా తదితర కారణాలతో గత మూడేళ్లుగా ఆయా కార్పొరేషన్లు రుణాల కార్యాచరణ సిద్ధం చేయకపోవడంతో.. కుట్టుమిషను, జిరాక్సు కేంద్రం, కిరాణా దుకాణం, ఆటోరిక్షా వంటి వాటితో స్వయం ఉపాధి పొందాలనుకున్న నిరుద్యోగుల ఆశలు నెరవేరడం లేదు. చివరకు తోపుడుబండి వ్యాపారానికి రూ.50 వేల సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా వేలల్లో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన తొమ్మిది లక్షలకు పైగా నిరుద్యోగ యువకులు రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల పరిధిలో నాలుగేళ్ల క్రితం చేసిన దరఖాస్తులు మనుగడలో ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖల్లో మూడేళ్ల కిందట తీసుకున్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.

సంక్షేమశాఖల వారీగా ఇదీ పరిస్థితి..

దళితబంధు పథకం వచ్చాక.. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల మంజూరులో కదలిక లేదు. వీటి కోసం ఏటా 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారు. 2017-18లో ఎంపికైన దరఖాస్తుదారులకు మంజూరైన రుణాలు రూ.80 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2018 నుంచి 2020 వరకు కార్యాచరణ అమలు చేయలేదు. 2020-21లో 1.73 లక్షల మంది దరఖాస్తు చేసినా, లక్ష్యం మేరకు 18,285 మందికి మాత్రమే రుణాలివ్వాలని ఎస్సీ కార్పొరేషన్‌ నిర్ణయించింది. వాటికి కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది.

గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్‌) పరిధిలో 2017-18 ఏడాదికి సంబంధించి పెండింగ్‌ రుణాలు ఇటీవల విడుదల చేశారు. ఆ తరువాత వరుసగా రెండేళ్లకు ప్రణాళిక రూపొందించలేదు. 2020-21, 2021-22లలో స్వయం ఉపాధి కోసం రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 27 వేల మందికి మాత్రమే ఉపాధి పథకాలు మంజూరయ్యాయి. వీటికి రూ.280 కోట్లు అవసరమని గిరిజన కార్పొరేషన్‌ అంచనా వేసినా నిధులు విడుదల కాలేదు.

బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు, సహకార సమాఖ్యల పరిధిలో 2017-18కి సంబంధించి 5.70 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరిలో రూ.లక్ష లోపు రుణాల కోసం దరఖాస్తు చేసిన 60 వేల మందికి నూరు శాతం సబ్సిడీ ఇస్తూ.. రూ.50 వేల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్ణయించింది. వారిలో 30 వేల మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేసింది. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల పరిధిలో రూ.లక్షకు పైగా రుణాల కోసం దరఖాస్తు చేసిన దాదాపు 5 లక్షల మంది దరఖాస్తులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.

మైనార్టీ కార్పొరేషన్‌ పరిధిలో 2018-19లో తీసుకున్న 23,829 దరఖాస్తుల పరిష్కారం పూర్తికాలేదు. కొత్త దరఖాస్తులు స్వీకరించడంలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని