Published : 26 May 2022 06:30 IST

పోషకాహారం సాగే బాగు

రాష్ట్రంలో సగానికి పైగా మహిళల్లో రక్తహీనత
28% పిల్లల్లో బరువు తక్కువ సమస్యలు
పౌష్టికాహార లోపమే కారణం
ఐరాసకు చెందిన ఎఫ్‌ఏఓ ప్రత్యేక నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్‌ అన్నారు శతాబ్దం క్రితం గురజాడ అప్పారావు. ఇప్పటికీ దేశంలో, రాష్ట్రంలో అవే పరిస్థితులు ఉన్నాయంటోంది ఐరాసకి చెందిన ప్రపంచ వ్యవసాయ, ఆహార సంస్థ(ఎఫ్‌ఏఓ). తెలంగాణలో పోషకాహార లోపం కారణంగా పిల్లలు బరువు తక్కువ సమస్యతో, మహిళలు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది. ఈ సమస్యల నివారణకు పోషకాహార ఉత్పత్తి స్పృహతో వ్యవసాయం (న్యూట్రిషన్‌ సెన్సిటివ్‌ అగ్రికల్చర్‌-ఎన్‌ఎస్‌ఏ)పై ప్రభుత్వం దృష్టి పెట్టాలంది. ‘రాష్ట్రంలో వ్యవసాయం, పోషకాహార ఉత్పత్తి మధ్య లోటును పూడ్చటం- వ్యవసాయ విస్తరణ- సలహా సేవలపై అంచనా’ పేరుతో తాజాగా ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. పోషకాహారం ఉత్పత్తిపై తెలంగాణ వ్యవసాయశాఖ తక్కువగా దృష్టి పెడుతోందని తెలిపింది.

నివేదికలోని అంశాలు..

రాష్ట్రంలో అయిదేళ్లలోపు బాలల్లో 28.3 శాతం మంది పోషకాహారలేమి కారణంగా తక్కువ బరువుతో ఉన్నారు. ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. నల్గొండ జిల్లాలో 23.1 శాతం పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఉత్పాదక వయసులో ఉన్న మహిళల్లో 53 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కనిష్ఠంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 50.6 శాతం, గరిష్ఠంగా ఖమ్మం జిల్లాలో 71.2 శాతం మహిళలు రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు.
రేషన్‌కార్డులపై తక్కువ ధరకు బియ్యం పంపిణీ వంటి పథకాల కారణంగా ప్రజలు వాటినే ప్రధాన ఆహారంగా తీసుకుంటూ అధిక పోషకాలుండే చిరు, తృణధాన్యాలను వదిలేశారు. ‘పోషకాహార లక్ష్యంగా సాగు’ చేపట్టడానికి రాష్ట్ర వ్యవసాయ విద్యాశిక్షణ కేంద్రం కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఉద్యాన శాఖ చేపడుతున్న కార్యక్రమాల్లో సైతం పోషకాహార పంటల సాగుపై రైతులను చైతన్యపరచడం, పోషకాహార వినియోగాన్ని ప్రోత్సహించడం వంటివి లేవు.

వ్యవసాయశాఖ స్పందించాలి..

వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అధిక దిగుబడినిచ్చే విత్తనాలను, అధునాతన పరిజ్ఞానాన్ని రైతులకు అందివ్వాలి. ఆయా పంటల ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటుచేసి శిక్షణ ఇవ్వాలి. సాధారణ పంటల నుంచి రైతులను తృణధాన్యాలు, కూరగాయలు, పండ్ల సాగు వైపు మళ్లిస్తే ప్రజలకు పోషకాహారం అందుతుంది.

తెలంగాణలో ఉన్న జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌), మేనేజ్‌ వంటి సంస్థలతోపాటు జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ వంటి వాటిలో పనిచేస్తున్న వారికి కూడా పోషకాహార లక్ష్యంగా వ్యవసాయం అనే అంశంపై ఎలాంటి ప్రత్యేక శిక్షణ ఇవ్వలేదు.

వ్యవసాయశాఖ కార్యక్రమాల్లో ఎన్‌ఎస్‌ఏను భాగంగా మార్చాలి. జాతీయ, రాష్ట్రస్థాయిలో ఆహార, పోషకాహార భద్రత సాధించడానికి ఇది చాలా అవసరం.

వీరి సేవలు భేష్‌..

యునిసెఫ్‌, ఎఫ్‌ఏఓ, ఇక్రిశాట్‌ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు పలు ఇతర ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు రాష్ట్రంలో పోషకాహార భద్రత కార్యక్రమాలకు సహకారం అందిస్తున్నాయి. సుస్థిర వ్యవసాయ వేదిక అనే స్వచ్ఛంద సంస్థ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పోషకాహారంపై పనిచేస్తోంది.

టాటా ట్రస్ట్‌ సైతం తెలంగాణలో పోషకాహారం అందించే కార్యక్రమాలు చేపడుతోంది. ఇవి ప్రారంభ దశలో ఉన్నాయి.

జహీరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ తృణధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ వాటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేస్తోంది.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని