భూసమీకరణ జీవోను శాశ్వతంగా ఎత్తివేయాలి

కాకతీయ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) పరిధిలో భూసమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను శాశ్వతంగా ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ ఉమ్మడి జిల్లా రైతులు బుధవారం హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు.

Published : 26 May 2022 05:32 IST

3 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు

ధర్మసాగర్‌, న్యూస్‌టుడే: కాకతీయ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) పరిధిలో భూసమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను శాశ్వతంగా ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ ఉమ్మడి జిల్లా రైతులు బుధవారం హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. జనగామ జిల్లా చెల్పూరు మండలం నష్కల్‌ సమీపంలోని రహదారిపై మూడు గంటల పాటు బైఠాయించారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మను దహనం చేశారు. జనగామ జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు వచ్చి మాట్లాడినా వినలేదు. రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నాయకులు, రైతులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకు మద్దతుగా భాజపా హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, డాక్టర్‌ విజయరామారావు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, సీపీఎం, సీపీఐ నేతలు రంగయ్య, భిక్షపతి, రైతు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. భూపరిరక్షణ ఐకాస నాయకులు మాట్లాడుతూ ‘కుడా’ చేపట్టిన  భూసమీకరణ వల్ల 27 గ్రామాలకు చెందిన 21,518 ఎకరాల భూమిని రైతులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు తాము వ్యతిరేకం కాదని.. అన్నదాతల భూములను తీసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయొద్దని కోరారు. భూ సమీకరణ జీవోను ఎత్తివేస్తున్నట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేశారని.. కానీ అధికారికంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు