ప్రతాపరెడ్డి స్మారక పురస్కారాల ప్రదానం రేపు

సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన అయిదుగురికి ఈ నెల 28న ఆయన స్మారక పురస్కారాలు అందజేయనున్నారు. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టు  గురువారం ఇక్కడ ఈ వివరాలను వెల్లడించింది.

Published : 27 May 2022 04:54 IST

అయిదుగురు ప్రముఖుల ఎంపిక

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన అయిదుగురికి ఈ నెల 28న ఆయన స్మారక పురస్కారాలు అందజేయనున్నారు. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టు  గురువారం ఇక్కడ ఈ వివరాలను వెల్లడించింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ట్రస్టు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి సురవరం పుష్పలత, కోశాధికారి సురవరం కృష్ణవర్ధన్‌ తదితరులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జాబితాను ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు ఇస్తున్నట్లు తెలిపారు. పురస్కారాలు అందుకోనున్న వారిలో  ప్రముఖ కవి, విమర్శకుడు డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి,  శాంత బయోటెక్‌ ఛైర్మన్‌ డా. వరప్రసాద్‌రెడ్డి,  పత్రికా రచయిత, వ్యాఖ్యాత డా.జుర్రు చెన్నయ్య, కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌ జిల్లా సంతేకహళ్లికి చెందిన పరిశోధకుడు, అనువాదకుడు డా.ఆర్‌.శేషశాస్త్రి, స్థపతి డా.ఈమని శివనాగిరెడ్డి ఉన్నారు. ప్రతాపరెడ్డి ప్రేరణతో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన ‘సామాజిక చరిత్ర’ పుస్తకాలను తీసుకొస్తున్నామని, 75 ఏళ్ల నాటి ఆయన రచనల్లో కొన్ని ఆంగ్లంలోకి అనువదిస్తున్నామని ట్రస్టు ప్రతినిధులు చెప్పారు. హరికృష్ణ మాట్లాడుతూ.. ప్రతాపరెడ్డి 125వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించనుందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 2 నుంచి అయిదు రోజుల పాటు సురవరం ప్రతాపరెడ్డి కథా చిత్రోత్సవం నిర్వహిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని