సంక్షిప్త వార్తలు

నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వ్యాపించాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఉత్తర కర్ణాటక నుంచి

Published : 27 May 2022 05:02 IST

నేడు, రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు వ్యాపించాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ.ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ సంచాలకులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం రాత్రి రాష్ట్రంలో పలు చోట్ల ఈదురుగాలలతో కూడిన వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిలా ఇల్లంతకుంట మండలంలో చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురానికి చెందిన కుర్మ వెంకటేశ్వర్లు(35) గురువారం వడదెబ్బతో మృతి చెందారు.


సమ్మతి పత్రాలు ఇచ్చినవారికే పరస్పర బదిలీ

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టు తుది తీర్పునకు అనుగుణంగా సీనియారిటీని నిర్ణయిస్తామని, అందుకు అంగీకరిస్తూ పరస్పర బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి సమ్మతి పత్రాలు తీసుకోవాలని డీఈవోలను పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన గురువారం ఆదేశించారు. ఈ ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని సూచించారు. సమ్మతి పత్రాలు ఇవ్వకుంటే పరస్పర బదిలీ దరఖాస్తును విరమించుకున్నట్లు భావిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 402 ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధిలో బదిలీ అయితే సీనియారిటీ ఉంటుంది. ఇతర జిల్లాలకు బదిలీ కోరుకుంటే సీనియారిటీ ఉండదు. ఆ జీవోను కొట్టివేయాలంటూ హైకోర్టులో కొందరు పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై న్యాయస్థానం తుది తీర్పు వెలువరించాల్సి ఉంది.


కొత్తగా 47 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 47 కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 7,93,044కు పెరిగింది. మరో 28 మంది కోలుకోగా ఇప్పటి వరకూ 7,88,516 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో తాజాగా హైదరాబాద్‌లో 26 పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.


టీవీవీపీలో 3,678 పోస్టుల కొనసాగింపు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌(టీవీవీపీ) పరిధిలోని ఆసుపత్రుల్లో ఒప్పంద, పొరుగు సేవల ప్రాతిపదికన మంజూరైన 3,678 పోస్టులను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇందులో 1,308 ఒప్పంద పోస్టులు కాగా 2,370 పొరుగు సేవల్లో నియమితులైనవి. ఈ పోస్టులను ఏప్రిల్‌ 1, 2022 నుంచి మార్చి 31, 2023 వరకూ కొనసాగించడానికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వీటికి అదనంగా 66 పోస్టుల కొనసాగింపునకు కూడా ఆమోదం తెలిపారు. వాస్తవానికి ఈ పోస్టులను 2021-22 సంవత్సరానికి ఆమోదం పొందకుండానే కొనసాగిస్తుండడంతో దాన్ని సరిదిద్దుతూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ 66 పోస్టుల్లో 9 ఒప్పంద, 57 పొరుగు సేవల ప్రాతిపదికన నియమించినవి ఉన్నాయి.


జూనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీల భర్తీ బాధ్యత టీఎస్‌పీఎస్సీకి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ బాధ్యతను విద్యాశాఖ.. టీఎస్‌పీఎస్సీకి అప్పగించనుంది. వాటిని గ్రూపు-4 పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకోసం విద్యాశాఖ వర్సిటీల్లో ఖాళీలపై కసరత్తు చేస్తోంది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ వద్ద గురువారం జరిగిన సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు హాజరై ఖాళీల వివరాలను అందజేశారు. జూనియర్‌ అసిస్టెంట్ల ఖాళీలే దాదాపు 600 వరకు ఉంటాయని అంచనాకు వచ్చారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌తో సమానమైన జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులను కూడా అందులో చేర్చాలా? వద్దా? అన్న ప్రశ్న తలెత్తింది. స్టెనోగ్రాఫర్‌ పోస్టు టెక్నికల్‌కు సంబంధించింది అయినందున వాటిని గ్రూపు-4లో చేర్చకపోవచ్చని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని