Updated : 27 May 2022 05:52 IST

కేంద్రం సహకరించట్లేదు

ఆర్థిక సమస్యలున్నా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు
శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా
వివేకానంద విదేశీ విద్యాపథక లబ్ధిదారులకు మంజూరు పత్రాలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గడిచిన ఎనిమిదేళ్లలో కేసీఆర్‌ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులూ ఎదురవుతున్నాయని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆర్థికపరమైన సమస్యలున్నమాట వాస్తవమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందడం లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయడానికి లేనిపోని కొర్రీలు పెడుతోందన్నారు. ఈ విఘ్నాలు తొలగిపోయేలా బ్రాహ్మణులు గట్టిగా ప్రార్థించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘వివేకానంద విదేశీ విద్యా పథకం’ కింద లబ్ధిదారులైన 133 మందికి ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం గురువారం తెలంగాణ సారస్వత పరిషత్తులోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తూ.. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఇతర కార్పొరేషన్లకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. వైశ్యులు, రెడ్లు కూడా తమకు కార్పొరేషన్‌ కావాలంటున్నారని చెప్పారు. డా.కె.వి.రమణాచారి నేతృత్వంలో విదేశీ విద్యా పథకం కింద రూ.26 కోట్లు అందించడం గొప్పగా ఉందన్నారు. అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఏది చేయాలన్నా ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి జ్వాలా నరసింహారావు మాట్లాడుతూ... త్వరలోనే రాష్ట్ర రాజధానిలో ‘బ్రాహ్మణ సదన్‌’ అందుబాటులోకి రానుందని తెలిపారు. సంక్షేమ పరిషత్తు సభ్యులు పూర్వ కేంద్ర మంత్రి డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలాచారి, సతీశ్‌, గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షుడు అయాచితం శ్రీధర్‌ మాట్లాడారు. పరిషత్తు సభ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ నివేదికను సమర్పించారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts