Published : 27 May 2022 05:35 IST

రోడ్లెలా వేయాలో కోర్టులు చెప్పలేవు

భూసేకరణ ప్రక్రియలో ముందుకెళ్లొచ్చు
ఎన్‌హెచ్‌ఏఐకి హైకోర్టు అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: రహదారులు ఎలా వేయాలో అధికారులకు కోర్టులు చెప్పలేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఎందుకోసం భూమిని సేకరించాలి, దేన్ని సేకరించాలి, దేన్ని సేకరించరాదనే విషయాలు కోర్టులు చెప్పజాలవంది. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ వివాదాలకు చట్టంలోనే పరిష్కార నిబంధనలున్నాయంది.  అభ్యంతరాలున్న వారు ఈ నిబంధనల ద్వారా పరిష్కారం పొందవచ్చని తేల్చిచెప్పింది. సంగారెడ్డి-నాందేడ్‌ అకోలా రోడ్‌ జాతీయ రహదారి నిమిత్తం సంగారెడ్డి జిల్లా కంది మండలంలో భూసేకరణను సవాలు చేస్తూ జి.నరసింగరావు మరో 10 మంది 2018లో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం ఉన్న మామిడిపల్లి రోడ్డు పశ్చిమాన భూసేకరణ చేపట్టకుండా కేవలం తమ భూమినే సేకరిస్తున్నారని, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. రూపొందించిన ప్లాన్‌ ప్రకారం ఇపుడున్న రోడ్డుకు ఇరువైపులా భూమిని సేకరిస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. నిపుణులు రూపొందించిన ప్లాన్‌ ప్రకారం రోడ్డును నిర్మిస్తామని జాతీయ రహదారుల అథారిటీ(ఎన్‌హెచ్‌ఐఏ) చెప్పడంతో పిటిషన్‌పై విచారణను సింగిల్‌ జడ్జి మూసివేశారు. అనంతరం రోడ్డు ప్రణాళిక మారిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులను పునఃపరిశీలించాలన్న ఎన్‌హెచ్‌ఐఏ అభ్యర్థనను తోసిపుచ్చారు. వీటిపై ఎన్‌హెచ్‌ఐఏ వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేయగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌.నందలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించింది. పిటిషనర్ల ప్రకారం.. తమ భూమిని సేకరించాల్సిన అవసరంలేదని, రెండు వైపుల నుంచి సమాన నిష్పత్తిలో సేకరించాలని కోరారని, దీన్ని పరిగణిస్తూ వివాదాన్ని పరిశీలించగలమా అంటూ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక చట్టం ఉందని, అందులో భూసేకరణ, పరిహారంతో సహా అన్ని విషయాలూ ఉన్నాయంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా నిర్మించడానికి చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో హైకోర్టు జోక్యం సమర్థనీయం కాదని పేర్కొంది. కేంద్రం వర్సెస్‌ కుషాల్‌శెట్టి కేసు ప్రకారం.. ఎన్‌హెచ్‌ఐఏలో నిపుణులు ఉంటారని, వారు ప్రణాళిక రూపొందిస్తారని, ఆ ప్రణాళిక సరైనదో కాదో కోర్టులు నిర్ధారించే పరిస్థితులు లేవంది. అంతేగాక కేవలం పిటిషనర్ల భూమినే దురుద్దేశపూరితంగా సేకరిస్తున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవంది. రూపొందించిన ప్రణాళిక మేరకు చట్టప్రకారం భూసేకరణ ప్రక్రియ చేపట్టవచ్చంది. ఎన్‌హెచ్‌ఏఐ అప్పీళ్లను అనుమతిస్తూ తీర్పు వెలువరించింది.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts