Published : 27 May 2022 05:35 IST

సైబర్‌ నేరాల వెల్లువ

రాష్ట్రంలో రోజుకు దాదాపు 150 ఫిర్యాదులు
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో నేరాల తీరు మారిపోతోంది. సంప్రదాయ నేరాలను సాంకేతిక నేరాలు అధిగమిస్తున్నాయి. దొంగతనాలు, దోపిడీల వంటి వాటితో పోల్చుకుంటే సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా నేరాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. మారుమూల పోలీస్‌స్టేషన్ల వద్ద కూడా సైబర్‌ బాధితులు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం సగటున రాష్ట్రంలో రోజుకు కనీసం సైబర్‌ నేరాలకు సంబంధించి 150 ఫిర్యాదులు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణలో గత ఏడాది 17,326 చోరీలు, దోపిడీ కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 47 కేసులు.. ఇదే సమయంలో నమోదైన సైబర్‌ నేరాల సంఖ్య 8839. అంటే రోజుకు 24 కేసులు నమోదయ్యాయన్నమాట. కానీ పరిస్థితి మారుతోంది. రోజుకు 150 వరకూ సైబర్‌ ఫిర్యాదులు వస్తున్నాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోనే కనీసం 100 వరకూ ఫిర్యాదులు ఉంటున్నాయన్నారు.  సైబర్‌ నేరాల విషయంలో అసలు బాధితులకే నేరం ఎలా జరిగిందో స్పష్టత ఉండదు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వ్యాలెట్‌ ద్వారా తన సోదరుడికి రూ.25 వేలు బదిలీ చేయగా సాంకేతిక కారణాల వల్ల లావాదేవీ పూర్తికాలేదు. తన డబ్బు పోయిందన్న కంగారులో ఆ వ్యక్తి గూగుల్‌లో సదరు వ్యాలెట్‌ సంస్థ కాల్‌సెంటర్‌ నంబరు తీసుకొని ఫిర్యాదు చేశాడు. కాల్‌సెంటర్‌ కేటుగాడు బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి మిగిలిన డబ్బు కూడా కొల్లగొట్టాడు. గూగుల్‌లో వ్యాలెట్‌ సంస్థ కాల్‌సెంటర్‌ పేరుతో సైబర్‌ నేరానికి పాల్పడ్డారు. కానీ ఇదెలా జరిగిందో బాధితుడికి అర్థం కాలేదు. వివరాలన్నీ తానే నేరస్థుడికి చెప్పాడు కాబట్టి బ్యాంకుకు సంబంధం లేదు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకొని పక్కనపెట్టారు. ప్రస్తుత ఫిర్యాదుల్లో మూడొంతులు ఇలానే ఉంటున్నాయి.

దర్యాప్తు తిప్పలు
సైబర్‌ నేరాల్లో పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాబట్టడం కష్టం. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండి నేరగాడు ఖాతాలు కొల్లగొడతాడు. హైదరాబాద్‌ వంటి నగరాల్లోని పోలీసులకు ఇలాంటి నేరాల తీరు, దర్యాప్తుపై పట్టు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి అంతగా అవగాహన లేదు. కానీ మామూలు నేరాల కంటే సైబర్‌ నేరాలు పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా దర్యాప్తు జరగకపోవడంతో బాధితులకు న్యాయం జరగడంలేదు. గ్రామీణ పోలీసులకు సైబర్‌ నేరాల్లో శిక్షణ ఇస్తున్నా.. అది సరిపోవడంలేదు. సైబర్‌ నేరాల దర్యాప్తుపై సిబ్బందికి ఎక్కువ అవగాహన కల్పించాలి. వచ్చిన ప్రతి ఫిర్యాదుపైనా దర్యాప్తు జరిపేలా చూడాలి. లేకపోతే వీటి సంఖ్య పెరిగి అదుపు చేయలేని స్థితికి చేరుకునే ప్రమాదముంది.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని