విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తెలంగాణ

విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 2014 జూన్‌ 2 నుంచి 2022 ఏప్రిల్‌ 1 వరకు 7,778 నుంచి 17,305 మెగావాట్లకు పెరిగిందని పేర్కొంది.

Published : 28 May 2022 03:53 IST

స్థాపిత సామర్థ్యం 7,778 నుంచి 17,305 మెగావాట్లకు పెంపు
తలసరి కరెంటు వినియోగంలో దేశంలో అగ్రస్థానం: ప్రభుత్వం వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 2014 జూన్‌ 2 నుంచి 2022 ఏప్రిల్‌ 1 వరకు 7,778 నుంచి 17,305 మెగావాట్లకు పెరిగిందని పేర్కొంది. ప్రజలకు నాణ్యమైన కరెంటును 24 గంటలూ అందిస్తున్న ఏకైక రాష్ట్రమని తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి విద్యుత్తు రంగంలో సాధించిన ప్రగతిని ప్రకటనలో వివరించింది. తలసరి కరెంటు వినియోగంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్లు పేర్కొంది. ‘‘రాష్ట్రం ఏర్పడిన తరవాత కొత్తగూడెం జిల్లా బయ్యారంలో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి విద్యుత్కేంద్రాన్ని, నల్గొండ జిల్లా దామెరచర్ల వద్ద 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి విద్యుత్కేంద్రాన్ని నిర్మిస్తున్నాం. భద్రాద్రి ఇప్పటికే పూర్తయి కరెంటు ఉత్పత్తి జరుగుతోంది. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 23,667 మంది ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి ఆర్టిజన్‌ పేరుతో నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.

ఉచిత సరఫరాకు రూ.39,200 కోట్ల రాయితీ

మొత్తం విద్యుత్తులో 40 శాతం వ్యవసాయానికే వినియోగిస్తున్నాం. రాష్ట్రం ఏర్పడ్డాక రూ.3,196 కోట్ల వ్యయంతో 6.39 లక్షల వ్యవసాయ కనెక్షన్లను ఇచ్చాం. ఏడున్నరేళ్లలో ఉచిత సరఫరాకు రూ.39,200 కోట్లను రాయితీగా విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లకు అందజేశాం. నాయీబ్రాహ్మణులు, ధోబీ ఘాట్లు, లాండ్రీలకు 250 యూనిట్ల వరకూ ఉచిత కరెంటు ఇస్తున్నాం. 10 వేల పవర్‌ చేనేత యూనిట్లకు కరెంటు ఛార్జీల్లో 50 శాతం రాయితీ కింద రూ.34.50 కోట్లు చెల్లించాం. విద్యుత్తు సబ్‌స్టేషన్లు, లైన్లు, పంపిణీ సామర్థ్యం పెంచడానికి రూ.35వేల కోట్లకు పైగా ఖర్చుచేశాం. ఈ సొమ్మును కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ‘విద్యుత్తు ఆర్థికసంస్థ’(పీఎఫ్‌సీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ)ల నుంచి 12 శాతం వడ్డీకి తీసుకున్నాం. వ్యక్తిగత రుణాలపై బ్యాంకుల వడ్డీకన్నా ఇది ఎక్కువ. అంతర్రాష్ట్ర కరెంటు సరఫరా కోసం పవర్‌గ్రిడ్‌ సంస్థకు రూ.1,580 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. కరోనా సమయంలోనూ విద్యుత్తు ఉద్యోగులు ప్రాణాలను పణంగాపెట్టి పనిచేశారు.భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెరగకుండా అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుని లాభాల్లో పయనించాల్సిన బాధ్యత విద్యుత్తు సంస్థల ఉద్యోగులపై ఉంది’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. నష్టాలను తగ్గించుకుని లాభాలిచ్చే వాణిజ్య, పారిశ్రామిక కరెంటు అమ్మకాల  పెంపు ద్వారా విద్యుత్తు సంస్థల స్థితిని మెరుగుపరుచుకోవడానికి అవకాశాలున్నాయని సూచించింది. ఈ ఏడాది(2022-23)లో కరెంటు ఛార్జీలను 18శాతం పెంచడానికి రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి అనుమతించింది. ఛార్జీల పెంపు ద్వారా రూ.6,831 కోట్లు రాబట్టాలని డిస్కంలు ప్రతిపాదించగా రూ.5,596 కోట్ల వరకూ పెంపునకు అనుమతించినట్లు సర్కారు చెప్పింది. 2014-15లో టన్ను బొగ్గు వినియోగంపై క్లీన్‌ఎనర్జీ రుసుం రూ.50 ఉండగా ఇప్పుడు రూ.400కి పెరిగిందని... చమురు, గ్యాస్‌, బొగ్గు, రవాణా ధరల పెంపు వల్ల విద్యుదుత్పత్తి వ్యయం అధికమైనట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని