ప్రయోగాత్మక మిల్లింగ్‌కు శ్రీకారం

యాసంగి ధాన్యం ప్రయోగాత్మక మిల్లింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన మిల్లుల నుంచి శాస్త్రవేత్తలు, అధికారుల బృందాలు ధాన్యం నమూనాలను సేకరిస్తున్నాయి. మైసూర్‌లోని సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌...

Published : 28 May 2022 06:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: యాసంగి ధాన్యం ప్రయోగాత్మక మిల్లింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన మిల్లుల నుంచి శాస్త్రవేత్తలు, అధికారుల బృందాలు ధాన్యం నమూనాలను సేకరిస్తున్నాయి. మైసూర్‌లోని సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎఫ్‌టీఆర్‌ఐ) ఆధ్వర్యంలో ప్రయోగాత్మక మిల్లింగ్‌(టెస్ట్‌ మిల్లింగ్‌) చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత మిల్లులోనే ఈ ప్రక్రియ నిర్వహించాలని భావించగా.. తాజాగా సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌లో ప్రయోగాత్మక మిల్లింగ్‌ చేయాలని నిర్ణయించారు. ఆ తరవాత క్షేత్రస్థాయిలోని మిల్లుల్లో దీన్ని చేపట్టనున్నారు. శాస్త్రవేత్తలు, అధికారులు కలిసి మూడు రోజుల్లో 10 జిల్లాల్లో నమూనాలు సేకరిస్తారు. రాష్ట్రంలో రైతులు వివిధ రకాల వరి వంగడాలు సాగు చేస్తుండగా.. ఒక్కో రకం వంగడానికి సంబంధించిన ఒకటీ రెండు నమూనాలు సేకరిస్తున్నారు. యాసంగిలో ఎండవేడికి ధాన్యం గింజల్లో తేమ శాతం తగ్గిపోతుంది. మిల్లింగ్‌ సమయంలో అవి నూకలుగా మారతాయి. ఆ పరిస్థితిని అధిగమించేందుకు తెలంగాణలో యాసంగి సీజనులో ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మారుస్తారు. ఈ సీజనులో ఉప్పుడు బియ్యం స్థానంలో సాధారణ బియ్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేయటంతో నూకల నష్టాన్ని భరించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, నష్టపరిహారం ఎంత ఇవ్వాలన్న విషయాన్ని నిర్ధారించేందుకు టెస్ట్‌ మిల్లింగ్‌ చేయించాలని ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు సీఎఫ్‌టీఆర్‌ఐతో పౌర సరఫరాల శాఖ అవగాహనకు వచ్చింది. ఒకే దఫా మిల్లింగ్‌ చేయడం కాకుండా ల్యాబ్‌లో కూడా ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ల్యాబ్‌లో పరీక్షించిన సమయంలో ఎంత శాతం నూకలు వచ్చాయి? మిల్లులో చేస్తే ఎంత శాతం వస్తాయి? అన్న అంశాలను అధికారులు బేరీజు వేసి తుది నిర్ణయానికి వస్తారని సమాచారం. ఆదివారంతో నమూనాల సేకరణ ప్రక్రియ పూర్తవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని