నిర్మల్‌ బల్దియాలో నియామకాల నిలిపివేత

అర్హులతో భర్తీ చేయాల్సిన మున్సిపల్‌ పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్స్‌ ఉద్యోగాలను తమ అనుయాయులకు కట్టబెట్టాలనుకున్నారు. అవకాశమున్నవారి దగ్గరి నుంచి అందినకాడికి దండుకున్నారు.

Updated : 28 May 2022 06:23 IST

కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ

ఈటీవీ, అదిలాబాద్‌-నిర్మల్‌, న్యూస్‌టుడే : అర్హులతో భర్తీ చేయాల్సిన మున్సిపల్‌ పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్స్‌ ఉద్యోగాలను తమ అనుయాయులకు కట్టబెట్టాలనుకున్నారు. అవకాశమున్నవారి దగ్గరి నుంచి అందినకాడికి దండుకున్నారు. ఉద్యోగాల ఎంపికలో జరిగిన అవినీతి అక్రమాలపై ‘ఈనాడు’లో వరుస కథనాలు రావడంతో ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, బాధిత నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు వెల్లువెత్తాయి. పరిస్థితి రోజురోజుకు తీవ్రమవడంతో ఏకంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌ని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ మున్సిపల్‌ ఉద్యోగ నియామక ప్రక్రియపై పూర్తి విచారణ చేసి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆర్డీవోను విచారణ అధికారిగా నియమించారు. ప్రస్తుతం ఉద్యోగ నియమాక ప్రక్రియను నిలిపేయడంతో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం అర్హులైన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది.

జరిగిందిదీ..

కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా 2021 డిసెంబరు 18న పురపాలక సంఘం కమిషనర్‌ ఎల్‌ఆర్‌సీ1/393/2021 నంబరుతో అర్హులైన అభ్యర్థుల కోసం జిల్లా ఉపాధి కల్పనశాఖకు లేఖ రాశారు. పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌ ఉద్యోగాలకు కనీస విద్యార్హత ఏడో తరగతి కావడంతో 1:20 ప్రకారం 44 ఉద్యోగాలకు 880 మందికి ఉపాధికల్పనశాఖ లేఖలు పంపించింది. వీరి నుంచే రోస్టర్‌ పద్ధతిలో మెరిట్‌ కం రిజర్వేషన్‌ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ, తమకు నచ్చినవారికే ఉద్యోగాలు కేటాయిస్తూ జాబితాను ముందుగానే సిద్ధం చేసుకున్నారనే విమర్శలున్నాయి. ఫిబ్రవరి 14న అందరికీ ముఖాముఖి మొక్కుబడిగా నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఉపాధికల్పన శాఖ కాల్‌లెటర్లు పంపినవారిలోంచే ఎంపిక చేయాలి. కానీ.. ప్రక్రియ మొదలై అయిదు నెలలు పూర్తవుతున్నా ఎంపికైన అభ్యర్థుల జాబితాను మాత్రం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు.

పారదర్శకతకు పాతర

ఈ ఉద్యోగాల భర్తీలో నిబంధనలకు పాతరేశారు. కంచె చేనుమేసినట్లుగా ‘పుర’ కీలక నేతతో పాటు ఓ జిల్లాస్థాయి అధికారి, బల్దియాలో పని చేసే మరొక అధికారి ఈ అక్రమాలకు తెరలేపినట్లు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి రూ.12 లక్షల నుంచి 15 లక్షలకు పైగానే వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. సదరు నేత కుమార్తె, అల్లుడు పేర్లుండటంతోపాటు సదరు ప్రజాప్రతినిధి బంధువుల పేర్లు కూడా ఉండటం, ఒకరిద్దరు కౌన్సిలర్ల రక్తసంబంధీకులు ఉండటం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఉపాధి కల్పన శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసిన నెల రోజుల్లోపు ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి తుది జాబితా వివరాలను సదరు కార్యాలయానికి అందించాలి. కానీ, ఉపాధి కల్పనాధికారి పలుమార్లు అడిగినా మున్సిపల్‌ అధికారులు జాబితాను ఇప్పటికీ ఇవ్వకపోవడం, అధికారికంగా ప్రకటించకపోవడం క్షేత్రస్థాయిలో జరుగుతున్న తతంగానికి అద్దంపడుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని