సేద్యానికి కొరవడుతున్న సర్కారు దన్ను

ఆర్థిక సంస్కరణల శకం ప్రారంభమయ్యాక భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని ఫౌండేషన్‌ ఫర్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌(ఎఫ్‌ఏఎస్‌) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ‘భారత వ్యవసాయంలో ప్రభుత్వ వ్యయం 2011-20’

Published : 28 May 2022 06:31 IST

క్రమంగా తగ్గుతున్న ప్రభుత్వ పెట్టుబడి..
రైతుల ఆదాయాలపైనా ప్రభావం 
ఫౌండేషన్‌ ఫర్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌ సంస్థ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్థిక సంస్కరణల శకం ప్రారంభమయ్యాక భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని ఫౌండేషన్‌ ఫర్‌ అగ్రేరియన్‌ స్టడీస్‌(ఎఫ్‌ఏఎస్‌) అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ‘భారత వ్యవసాయంలో ప్రభుత్వ వ్యయం 2011-20’ పేరుతో తాజాగా వెలువరించిన నివేదికలో ఈమేరకు పలు అంశాలను వెల్లడించింది. ఆసియాలో భారత్‌తో పాటు వియత్నాం, ఆఫ్రికాలోని టాంజానియా, జాంబియా దేశాల్లో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల తీరుపై రోసా లక్సెంబర్గ్‌ స్టిఫ్‌టంగ్‌ అనే సంస్థతో కలిసి అధ్యయనం చేసినట్లు వివరించింది. భారత్‌లో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలనూ నిశితంగా పరిశీలించినట్లు పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం వ్యయంలో వ్యవసాయ రంగం వాటా 2009లో 11 శాతం కాగా.. 2019 నాటికి అది 9.5 శాతానికి తగ్గిందని తెలిపింది. ‘‘విత్తనాలు, ఎరువులు, యంత్రాలు వంటి సామగ్రిపై ప్రభుత్వ రాయితీలు తగ్గుతూ వస్తున్నాయి. రాయితీలతో ప్రభుత్వంపై భారం పెరుగుతోందన్న వాదన వినిపిస్తున్నా.. వాటిని తగ్గించేకొద్దీ వ్యవసాయానికి రైతు పెట్టే పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్నాయి. ఉదాహరణకు డీఏపీ ఎరువు కిలో ధర 1995లో రూ.17.66 ఉంటే 2019లో రూ.49.05కి చేరింది. ఇలా సాగు ఖర్చులు పెరగడంతో పాటు పంటల కొనుగోలు ధరలు తగ్గడంతో రైతులకు లాభాలు తగ్గిపోతున్నాయి’’ అని నివేదిక పేర్కొంది. వ్యవసాయ పరిశోధనలపై ప్రైవేటు కంపెనీలు పెట్టే పెట్టుబడులు.. నిరుపేదల్లో కొద్దిమందికే ఉపయోగపడుతున్నాయని స్పష్టం చేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని