లెక్కకు మిక్కిలి.. హక్కుల చిక్కులు!

భూ పరిపాలన బాధ్యతలను రెవెన్యూ శాఖ క్రమంగా పక్కనపెడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హక్కుల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను తీర్చడంలో ఆ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని వాపోతున్నారు.

Updated : 28 May 2022 06:54 IST

ఆన్‌లైన్‌ ఫిర్యాదులకు స్పందన కరవు 
నేరుగా మొర వినిపించే ఏర్పాటేదీ?
అంతంత మాత్రంగానే ధరణి సహాయ కేంద్రాలు..

ఈనాడు, హైదరాబాద్‌: భూ పరిపాలన బాధ్యతలను రెవెన్యూ శాఖ క్రమంగా పక్కనపెడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హక్కుల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను తీర్చడంలో ఆ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందని వాపోతున్నారు. అన్ని రాష్ట్రాల్లో భూ పరిపాలనను రెవెన్యూ శాఖే నిర్వహిస్తూ హక్కులు కల్పిస్తోంది. రాష్ట్రంలోనూ 2020 అక్టోబరు 29 వరకు సజావుగానే సాగింది. ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చాకే పరిస్థితి మారిపోయింది. పోర్టల్‌ శాఖ పరిధిలోనే ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో భూ దస్త్రాల సమాచారం ఉన్న ఖాతాదారుల లావాదేవీలనే నిర్వహిస్తున్నారు. ధరణి బయట ఉన్న వారు, పోర్టల్‌లో నమోదైనా వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నవారిని రెండేళ్లుగా పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. 

రాష్ట్రంలో 1936లో చేపట్టిన క్షేత్రస్థాయి సర్వే ఆధారంగా ఏర్పాటు చేసిన సర్వే నంబర్లు, హద్దుల సమాచారం ప్రాతిపదికనే ఇప్పటికీ దస్త్రాల నిర్వహణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సమగ్ర సర్వేకు సన్నద్ధమైనప్పటికీ కార్యాచరణ చేపట్టలేదు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ దస్త్రాల పరిశీలనకు 2017 చివర్లో ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం దస్త్రాలను డిజిటలీకరించారు. 71 లక్షల ఖాతాలు ఉంటే 61.30 లక్షల ఖాతాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి పోర్టల్‌ పరిధికి తెచ్చారు. మరో మూడున్నర లక్షల మంది రైతులకు సంబంధించిన ఖాతాలు ఆన్‌లైన్‌ కాలేదు. ఇలాంటి వారి సమాచారాన్ని పోర్టల్లో చేర్చేందుకు మాడ్యూళ్లు, ఐచ్ఛికాలు లేవని తహసీల్దార్లు, జిల్లా అధికారులు చెబుతున్నారు. కొందరు బాధితులు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేస్తున్నా.. పట్టించుకున్నవారే లేరు. మరోవైపు సహాయ కేంద్రాల ఏర్పాటూ అంతంతమాత్రంగానే ఉంది. 

ఉపసంఘం సూచించినా.. 

2020 అక్టోబరుకు ముందు యాజమాన్య హక్కులు కల్పించే అధికారం తహసీల్దార్లకు ఉండేది. ఇప్పుడు ఈ పరిస్థితి లేకపోవడంతో బాధితులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ అయోమయాన్ని దూరం చేసేందుకు మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ధరణి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కొన్ని జిల్లా కేంద్రాల్లో అవి ఏర్పాయ్యాయి. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో సిబ్బంది సూచిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు వారాలు సహాయ కేంద్రాలు నడిపించి.. మమ అనిపించారు. దీంతో తిరిగి ప్రజావాణి కార్యక్రమంపై బాధితులు ఆధారపడుతున్నారు. పూర్తిస్థాయిలో భూ సమస్యలు పరిష్కారమయ్యే దాకా సహాయ కేంద్రాలు కొనసాగించడంతోపాటు ధరణిలో మాడ్యూళ్లు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

భూ సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్న ఓ బాధితుడికి ఇటీవల ప్రజావాణిలో యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్‌ రాసిచ్చిన సమాధానం ఇది. ‘తహసీల్దారు గారు.. ఈ సమస్యను పరిశీలించి, ధరణిలో ఎలా దరఖాస్తు చేయాలో వీరికి సలహా ఇవ్వండి’ అంటూ అదనపు కలెక్టర్‌ సూచన చేశారు. ఏం చేయాలో అర్థంకాక కలెక్టరేట్‌కు వస్తే.. అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే సమాధానం బాధితులకు ఎదురవుతుండటం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని