యోగాకు విశ్వవ్యాప్త గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా యోగాకు మరింత గుర్తింపు తీసుకురావడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సర్బానంద సోనోవాల్‌ అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా యోగా

Published : 28 May 2022 06:38 IST

యోగా ఉత్సవ్‌ను ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై 

హాజరైన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి,  సర్బానంద సోనోవాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా యోగాకు మరింత గుర్తింపు తీసుకురావడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సర్బానంద సోనోవాల్‌ అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా యోగా ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నారు. 25 రోజుల కౌంట్‌డౌన్‌లో భాగంగా హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి  వేలమంది ఔత్సాహికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారందరూ యోగాసనాలు వేశారు.  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్‌ 21వ తేదీన ట్యాంక్‌బండ్‌ వద్ద భారీ వేడుకను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఆ వేడుకలో నగరవాసులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మరో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ మాట్లాడుతూ యోగా ఉత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ప్రసంగిస్తూ యోగా నిత్యజీవితంలో ఒక భాగం కావాలని సూచించారు. జూన్‌ 21వ తేదీన యోగా దినోత్సవ జరుపుకోవడానికి ప్రధాన కారణం ఆ రోజు ఏడాది మొత్తంలో ఎక్కువ పగలు ఉండటమేనని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. ఇందులో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర ఆయుష్‌శాఖ సహాయ మంత్రి మహేంద్ర ముంజపర, సినీనటులు మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి, తేజ సజ్జా, మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌, భాజపా నేత డా.లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని