Updated : 28 May 2022 06:59 IST

ఎత్తర జెండా.. తెదేపా అండ

 మహానాడుకు స్వచ్ఛందంగా  తరలి వచ్చిన అభిమానులు

 (మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి)

మూడేళ్ల విరామం తర్వాత భారీగా జరుగుతున్న తెదేపా మహానాడుకు విశేష సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. అనంతపురం నుంచి ఉత్తరాంధ్ర వరకూ అన్ని ప్రాంతాల నుంచి అన్ని వయసుల వారూ పోటెత్తారు. సొంత వాహనాలు సమకూర్చుకుని, బస్సులు, రైళ్లలోను, చివరకు ఆటోలు కట్టించుకునీ నేరుగా వచ్చేశారు. తెదేపా ఈసారి మహానాడును తొలిరోజు పార్టీ ప్రతినిధుల సమావేశంగానే నిర్వహించాలనుకుంది. 12వేల నుంచి 14వేల మంది వరకు వస్తారని భావించింది. కానీ పార్టీ అభిమానులు, సామాన్య ప్రజలు భారీగా తరలి రావడంతో ఇది బహిరంగ సభగా మారిపోయింది. 

జడత్వం వదిలి ఉత్సాహంగా అడుగులు
ఎన్నికలకు మరో రెండేళ్లే ఉండటం, ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతుండటంతో తెదేపా కార్యకర్తలు, అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇన్నాళ్లూ అధికార పార్టీ బెదిరింపులు, పోలీసుల నిర్బంధంతో తెదేపా కార్యకర్తలతో పాటు, అభిమానులు, మద్దతుదారులు బయటకు వచ్చేందుకు జంకేవారు. ఇప్పటికీ నిర్బంధాలున్నా.. వారిలో తెగింపు వచ్చింది. జడత్వం వదిలింది. ఇటీవల పార్టీ కార్యక్రమమంటే నాయకుల కంటే వారే ముందుగా వస్తున్నారు. తెదేపా మహానాడుకు అదే తెగింపుతో బయల్దేరి వచ్చారు. మహానాడుకు హాజరైన వారిలో చిన్న రైతులు, రెక్కాడితే గానీ డొక్కాడని వారు, శ్రామికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తమపై నిర్బంధాలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ పథకాలు ఆపేస్తామన్న బెదిరింపులూ ఉన్నాయని వారిలో కొందరు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెదేపాను గెలిపించుకోవాలన్న కసితో  తరలివచ్చామని వారు పేర్కొన్నారు. వారిలో చాలామంది స్వచ్ఛందంగా వచ్చినవారే. కడప నుంచి తెదేపా అభిమానులు స్వర్ణలత, నిర్మలతో పాటు మరో ఇద్దరు రూ.10వేలు ఖర్చు పెట్టుకుని వచ్చారు.  

ఎటు చూసినా కోలాహలం

తెదేపా మహానాడు తొలిరోజు కార్యక్రమం అట్టహాసంగా, మహా ఉత్సవంలా జరిగింది. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో జనం తరలివచ్చారని తెదేపా నాయకులు తెలిపారు. ఉదయం 6గంటల నుంచే నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల రాక మొదలైంది. ప్రతినిధుల నమోదు మొదలవక ముందే ముందు వరుస కుర్చీలు నిండిపోయాయి.పెద్ద సంఖ్యలో జనం నిల్చుని కార్యక్రమాలు చూశారు. మహానాడు వేదికను జాతీయ రహదారి నుంచి 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు.వేదిక నుంచి జాతీయ రహదారి వరకు మధ్యలో ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. చంద్రబాబు ప్రత్యేక భద్రతా సిబ్బంది, పోలీసులు, వాలంటీర్లు... ఉత్సాహంగా దూసుకువస్తున్న కార్యకర్తల్ని నిలువరించలేకపోయారు.చంద్రబాబు వేదికపైకి వచ్చినప్పుడు, ఆయన ప్రసంగం ప్రారంభించినప్పుడు ప్రాంగణమంతా నినాదాలు, ఈలలతో హోరెత్తింది.   
ః మహానాడుకు వచ్చేవారికి ఏర్పాట్లు చేయడంలో తొలిరోజు పలు లోటుపాట్లు కనిపించాయి. అంచనాలకు మించి ప్రజలు తరలిరావడంతో కొందరికి భోజనం దొరకలేదు. మంచినీళ్లకూ కొరత ఏర్పడింది. సభా ప్రాంగణంలో కూలర్లు లేక.. ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారు. తెదేపాకు ఇదివరకు అత్యంత పటిష్ఠమైన వాలంటీర్ల వ్యవస్థ ఉండేది. ఈసారి మహానాడులో వాలంటీర్ల సేవలు అందలేదు. 


మరో శ్రీలంకలా ఆంధ్రప్రదేశ్‌!

రాష్ట్రాన్ని కాపాడుకుందాం 

తెదేపా రాజకీయ తీర్మానం 
 

‘ఆర్థిక నేరస్థుడి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంక కాబోతోంది. ఇప్పటికే రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించిన శ్రీలంక అధ్యక్షుడి ఇంటిని ప్రజలు, యువత ముట్టడించినట్లే త్వరలో జగన్‌రెడ్డి ఇంటినీ ప్రజలు ముట్టడించే పరిస్థితి తెచ్చుకునేలా ఉన్నారు. కరెంటు ఛార్జీల పెంపు, పన్నుల బాదుడుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో భవిష్యత్తులో ఏపీ శ్రీలంకలా మారే ప్రమాదం కనిపిస్తోంది’ అంటూ తెదేపా రాజకీయ తీర్మానం పేర్కొంది. మహానాడులో ఆ పార్టీ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 

బాబు సీఎం కావడం ఖాయం: రావుల 

రాజకీయ తీర్మానంలో భాగంగా రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు ఏపీకి మరోసారి సీఎం కావడం ఖాయం, జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తారు’ అని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు చంద్రబాబు అండదండలు కావాలని కోరారు. బాబు హయాంలో సూక్ష్మసేద్యంపై ఇచ్చిన నివేదిక కారణంగానే 90% రాయితీపై పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

రైతులను దగా చేస్తున్న కేసీఆర్‌ సర్కారు

‘గడిచిన ఏడేళ్లలో తెలంగాణలో 7,409 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేవలం గత మూడు నెలల్లోనే 330 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే అక్కడి రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలియజేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులను దగా చేస్తోంది’ అని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు సీహెచ్‌.కాశీనాథ్‌ ధ్వజమెత్తారు. ‘వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో వైఫల్యం.. నిర్వేదంలో తెలంగాణ రైతాంగం’ అనే తీర్మానాన్ని కాశీనాథ్‌ ప్రవేశపెట్టి మాట్లాడారు. ‘తెలంగాణలో అమలు చేస్తున్నది రైతుబంధు కాదు, భూస్వామ్యుల బంధు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్లు అప్పుచేసి, రూ.80 వేల కోట్లు ఖర్చుచేసినా ప్రయోజనంలేదు. తెలంగాణకు 65 శాతం ఐటీ ద్వారానే ఆదాయం వస్తోంది. ఇది చంద్రబాబు దయవల్లే సాధ్యమవుతోంది’ అని కాశీనాథ్‌ పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షులు సామ భూపాలరెడ్డి బలపరిచారు. 

తెలంగాణలోనూ అఘాయిత్యాలు

‘ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ ప్రతి 3గంటలకు ఓ అఘాయిత్యం జరుగుతోంది. మూడేళ్లలో అత్యాచారాలు, అఘాయిత్యాలు మూడురెట్లు పెరిగాయి. అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాసరే తెదేపానే ప్రజలు నమ్ముతున్నారు’ అని తెలంగాణ తెదేపా మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించి ‘యువజన, మహిళాసాధికారతకు తూట్లు’ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆమె మాట్లాడారు. తీర్మానాన్ని బలపరిచిన తెలంగాణ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు పొగాకు జయరాంమాట్లాడుతూ..‘చంద్రబాబు అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్‌సిటీ వంటివి నిర్మిస్తే.. మా సీఎం ఫామ్‌ హౌస్‌ కట్టుకున్నారు’ అని పేర్కొన్నారు.


 తెలంగాణ తెదేపాకు కొత్త సైన్యం అవసరం: బక్కని నర్సింహులు

మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో తెలుగుదేశానికి కొత్త సైన్యాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెదేపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు బక్కని నర్సింహులు పేర్కొన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తెదేపాయేనని, ఎన్టీఆర్‌ పాలనలోనే తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం లభించిందని వివరించారు. మహానాడులో శుక్రవారం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు. రెండు పడకగదుల ఇళ్ల పథకం చెరువులోకి వెళ్లిపోయింది. ప్రాంతీయ అసమానతలు లేకుండా ఎన్టీఆర్‌, చంద్రబాబు పాలించారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తాం. హైదరాబాద్‌కు బిల్‌క్లింటన్‌, బిల్‌గేట్స్‌ వంటి వారిని రప్పించిన ఘనత చంద్రబాబుదే. మహిళా సాధికారత చంద్రబాబు వల్లే సాధ్యమైంది. 14 నెలల్లోనే హైటెక్‌ సిటీ నిర్మించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగాలిప్పించారు. ఉపాధి కల్పించారు’’ అని నర్సింహులు వివరించారు.

 ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పులపాలు చేశారు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్‌ అప్పులపాలు చేశారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్‌కుమార్‌గౌడ్‌ దుయ్యబట్టారు. తెదేపా హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలు, ఐటీ విప్లవంతో తెలంగాణ ప్రాంతం ధనికంగా మారగా.. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అప్పు రూ.5 లక్షల కోట్లకు చేరిందని ఆరోపించారు. ‘సంపన్న రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు.. ధరల నియంత్రణలో వైఫల్యం చెందారు’ అనే తీర్మానాన్ని అరవింద్‌కుమార్‌గౌడ్‌ ప్రవేశపెట్టారు. మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, బంటు వెంకటేశ్వర్లు బలపరిచారు. 


320 మంది రక్తదానం

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో సభా ప్రాంగణంవద్ద రక్తదానం, వైద్య శిబిరం నిర్వహించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, మాజీ మంత్రి దేవినేని ఉమా రక్తదానం చేసి కార్యకర్తల్లో స్ఫూర్తి నింపారు. సాయంత్రానికి మొత్తం 320 మంది రక్తదానం చేశారు. 
60 వేల మందికి భోజనాలు: విజయవాడకు చెందిన కె.శివాజీ నేతృత్వంలో భోజన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 60వేల మంది భోజనం చేశారని నిర్వాహకులు తెలిపారు. రాత్రికి 15వేల మందికి వంట చేశామన్నారు. శనివారం లక్ష మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నామని, ఇంకా పెరిగినా అందించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. వాస్తవానికి ప్రతినిధుల సభకు 12వేల మందికి వసతి ఏర్పాటు చేసినా అంతకు 5రెట్లు రావడంతో ఒక దశలో భోజనాలు అందించడం కష్టతరంగా మారింది. దాదాపు 30 కౌంటర్లు ఏర్పాటు చేసినా రద్దీ తగ్గలేదు.  

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని