రూ.2 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్‌ సాధనే లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం రెడ్ల సంక్షేమం కోసం రూ.2 వేల కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేంతవరకూ విశ్రమించేది లేదని రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి అన్నారు.

Published : 28 May 2022 07:04 IST

రెడ్ల మహాసంగ్రామ సభలో వక్తలు

మేడ్చల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం రెడ్ల సంక్షేమం కోసం రూ.2 వేల కోట్లతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేసేంతవరకూ విశ్రమించేది లేదని రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌లో రెడ్ల మహా సంగ్రామం పేరుతో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రెడ్ల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. పేద రెడ్లు సర్కారు పథకాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్‌ ఏర్పాటు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో సత్తా చూపుతామన్నారు. ప్రగతిభవన్‌ ముట్టడించైనా కార్పొరేషన్‌ను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కులంతో సంబంధం లేకుండా అందరికీ విద్య, వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్‌ చేశారు. తమ పిల్లల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున జనరల్‌ గురుకులాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఐకాస ఛైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, రాఘవరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రేపు రెడ్ల సింహగర్జన మహాసభ

నారాయణగూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించనున్న రెడ్ల సింహగర్జన మహాసభకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు భారీగా తరలిరావాలని రెడ్డి ఐకాస, రెడ్డి జాగృతి, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్యలు పిలుపునిచ్చాయి. సభ విజయవంతానికి శుక్రవారం హైదర్‌గూడలో ఆయా సంఘాల అన్ని జిల్లాల సమన్వయకర్తలు, అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ శివారులో (ఓఆర్‌ఆర్‌, ఘట్‌కేసర్‌ చౌరస్తా పక్కన) సభాస్థలిని ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని