Updated : 29 May 2022 06:25 IST

Telangana: మళ్లీ రవాణా బాదుడు..!

వాణిజ్య వాహనాలపై భారీగా పెరిగిన త్రైమాసిక పన్ను

గుట్టుచప్పుడు కాకుండా అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వాణిజ్య వాహనాల పన్నులు పెరిగాయి. క్షేత్రస్థాయి అధికారులకే కాదు వాహనదారులకూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఈ పెంపుదలను అమల్లోకి తెచ్చింది. దీంతో మూడు నెలలకోసారి చెల్లించాల్సిన పన్ను తడిసి మోపెడయింది. గడువు మేరకు పన్ను చెల్లించేందుకు ఆన్‌లైన్‌, మీసేవా కేంద్రాల్లో ప్రయత్నిస్తే భారీగా పన్ను పెరిగినట్లు చూపిస్తుండటంతో వాహనదారులు కంగుతింటున్నారు. ఇటీవల వాహనాల జీవితకాల పన్ను మొత్తాన్ని భారీగా పెంచిన ప్రభుత్వం ఇప్పుడు వాణిజ్య వాహనాల పన్నును సైతం పెంచింది.

భారీగా భారం

రాష్ట్రంలో సుమారు 5.70 లక్షల వరకు సరకు రవాణా వాహనాలు ఉన్నాయి. క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు మరో 1.40 లక్షల వరకు ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలల బస్సులు 27 వేలకు పైగా ఉన్నాయి. వీటితోపాటు ప్రయాణికులను చేరవేసే బస్సులు, వివిధ అవసరాలకు వినియోగించే ట్యాంకర్లపైనా పన్ను భారం పడింది. కొన్నింటికి 20 శాతం వరకు పెరిగితే మరికొన్నింటికి అంతకుమించి పెరిగినట్లు సమాచారం. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలతో పోలిస్తే రాష్ట్రంలోని పన్నులు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పటికే డీజిల్‌ ధరలు పెరగడంతో కూడా వాణిజ్య వాహనాలు నడపటం భారంగా మారిందని ఆపరేటర్లు ఆవేదన చెందుతున్నారు.

* పాఠశాల విద్యార్థుల కోసం నడిపే మినీ బస్సులపై గతంలో రూ.775 ఉన్న పన్నును రూ.910కి పెంచింది.

* పెద్ద బస్సులపై పన్ను రూ.1,396 ఉండగా,   రూ.1,750లకు పెంచింది.

* ఆల్‌ ఇండియా పర్మిట్‌ తీసుకున్న బస్సులోని ప్రతి సీటుకు గతంలో రూ. 3,675 ఉండే మొత్తాన్ని రూ. రూ.4,000లకుపెంచింది.

* రాష్ట్రమంతా తిరిగే బస్సులోని ప్రతి సీటుకు పన్ను గతంలో రూ.2,625 ఉండగా రూ.4,000లకు పెంచింది.


ఆ భారం ప్రయాణికులపైనే

ప్రభుత్వం పన్నులు పెంచటంతో ఆ భారం ప్రయాణికులపైనే పడుతుంది. ప్రయివేటు బస్సులను రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ముందుకు రాని పరిస్థితి తలెత్తుతుంది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆల్‌ ఇండియా పర్మిట్‌ బస్సులతో పోలిస్తే తెలంగాణలో నాలుగో వంతు కూడా లేవు. ప్రస్తుతం పెరిగిన పన్నులతో మరింత ప్రభావం పడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో రూ.వేలల్లో పన్ను చెల్లిస్తుంటే, ఇక్కడ రూ.లక్షల్లో చెల్లించాల్సి వస్తోంది. పన్నులు తగ్గించి ఇతర రాష్ట్రాల బస్సులూ ఇక్కడ రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చేస్తే ఆదాయం పెరుగుతుంది. 

- ముత్యాల సునీల్‌కుమార్‌, ఆరెంజ్‌ ట్రావెల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌


పన్ను భారం తగ్గించాలి

సరకు రవాణా వ్యవస్థ పరిస్థితి ఇప్పటికే ఆందోళనకరంగా ఉంది. కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు. వాహనాలు కొనుగోలు చేసేందుకు చేసిన అప్పుల వాయిదాలు చెల్లించకపోవటంతో ఫైనాన్స్‌ కంపెనీలు వాటిని స్వాధీనం చేసుకున్నాయి. కొంతమంది ఆస్తులు అమ్ముకుని వాయిదాలు చెల్లించారు.ఈ పరిస్థితుల్లో పన్నులు పెంచటం అన్యాయం. ప్రభుత్వం పునరాలోచన చేసి త్రైమాసిక పన్నును తగ్గించాలి. ఈ రంగంలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగం కుదేలైతే ఆయా కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతుంది.

- మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని