రుణానికి రాష్ట్రం ఎదురుచూపులు

ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 2 నెలలు ముగుస్తున్నా.. బాండ్ల ద్వారా రుణాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనుమతి ఇవ్వలేదు. వచ్చే శుక్రవారం (జూన్‌ 3) నాటికి అనుమతి రావచ్చని రాష్ట్ర ఆర్థికశాఖ ఎదురుచూస్తోంది.

Published : 29 May 2022 06:09 IST

ఇంకా అనుమతి ఇవ్వని కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 2 నెలలు ముగుస్తున్నా.. బాండ్ల ద్వారా రుణాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనుమతి ఇవ్వలేదు. వచ్చే శుక్రవారం (జూన్‌ 3) నాటికి అనుమతి రావచ్చని రాష్ట్ర ఆర్థికశాఖ ఎదురుచూస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో రూ.11 వేల కోట్ల అప్పు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్‌, మే వరకూ ఒక్క రూపాయికి కూడా అనుమతి రాలేదు. ఈ నెల చివరలో రూ.3 వేల కోట్ల అప్పు తీసుకోవడానికి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి కోరగా.. ఇతర రాష్ట్రాలను అనుమతించి తెలంగాణకు మాత్రం ఇంకా ఏమీ చెప్పలేదు.

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థ(కార్పొరేషన్ల)ల కార్యకలాపాలకు గతంలో తీసుకున్న రూ.లక్షా 30 వేల కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా పరిగణిస్తామని కేంద్రం కొత్తగా షరతు పెట్టడంతో కొత్త రుణాలకు అనుమతి రావడంలేదు. రాష్ట్రంలోని 17 కార్పొరేషన్ల ఆదాయ వ్యయాలు, వాటికున్న అప్పుల వివరాలను కేంద్రం ఇటీవల అడిగి తీసుకుంది. అవి తీసుకున్న అప్పులకు నెలవారీ కిస్తీల చెల్లింపునకు రాష్ట్ర బడ్జెట్‌ నుంచే నిధులు కేటాయిస్తున్నందున.. వాటిని రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని తెలిపింది. అవి కూడా కలిపితే తెలంగాణ రాష్ట్ర అప్పుల పరిమాణం పెరగడంతో కొత్త రుణాలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదు. కార్పొరేషన్లు సొంత కార్యకలాపాలకు అప్పులు తీసుకుని తిరిగి అవే చెల్లిస్తాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా చూడవద్దని రాష్ట్ర ఆర్థికశాఖ విన్నవించింది. అయినా కేంద్రం ససేమిరా అంటోంది. మరో వారం రోజుల్లోగా అప్పులకు అనుమతి రాకపోతే జూన్‌ 1న ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు, ఆసరా పింఛన్లు, ఇతర బిల్లుల చెల్లింపులకు నిధుల కొరత ఏర్పడవచ్చని అంచనా. గతంలో తీసుకున్న అప్పుల కిస్తీలు, వడ్డీ చెల్లింపులకు సైతం నిధులు అవసరం. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ చేయడానికి రూ.7,600 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ అంచనా. ఈ లెక్కన అన్ని చెల్లింపులు జూన్‌ మొదటి పక్షంలోపు సజావుగా జరగాలంటే రూ.14 వేల కోట్ల వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణావసరం.

రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థలకు గతంలో మంజూరైన రుణాల విడుదలను సైతం కేంద్రం నిలిపివేస్తోంది. ఆర్‌ఈసీ సంస్థ నుంచి రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు గతంలో మంజూరైన రుణాల్లో ఈ నెలలో విడుదల కావాల్సిన రూ.250 కోట్లను కేంద్రం నిలిపివేసింది. పాత అప్పుల విడుదల నిలిపివేయడం అన్యాయమని, దీనిపై దిల్లీ వెళ్లి ఆర్‌ఈసీని ప్రశ్నించాలని తెలంగాణ జెన్‌కో సీఎండీ యోచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని