University: చేరిన కళాశాల నుంచే మరో వర్సిటీలో చదువుకోవచ్చు!

సాధారణంగా ఎవరైనా విద్యార్థి ఒక యూనివర్సిటీలో చేరితే.. సౌకర్యాలు సరిగా లేకున్నా, కోర్సు పూర్తయ్యే వరకు అక్కడే చదువు కొనసాగించాలి. ఆ ఇబ్బందిని దూరం చేస్తూ విద్యార్థి తాను చేరిన కోర్సులో ఏదైనా ఒక పేపర్‌/సబ్జెక్టును ఇతర వర్సిటీల నుంచి దూరవిద్య/ఆన్‌లైన్‌ విధానంలో చదువుకొనే అవకాశం లభించనుంది.

Updated : 29 May 2022 08:41 IST

ఏదైనా ఒక పేపర్‌/సబ్జెక్టుకే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: సాధారణంగా ఎవరైనా విద్యార్థి ఒక యూనివర్సిటీలో చేరితే.. సౌకర్యాలు సరిగా లేకున్నా, కోర్సు పూర్తయ్యే వరకు అక్కడే చదువు కొనసాగించాలి. ఆ ఇబ్బందిని దూరం చేస్తూ విద్యార్థి తాను చేరిన కోర్సులో ఏదైనా ఒక పేపర్‌/సబ్జెక్టును ఇతర వర్సిటీల నుంచి దూరవిద్య/ఆన్‌లైన్‌ విధానంలో చదువుకొనే అవకాశం లభించనుంది. వచ్చే(2022-23) విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెసులుబాటు కల్పించింది. ఈ విధానం కింద దేశంలో యూజీసీ అనుమతి ఉన్న ఏ విశ్వవిద్యాలయం నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. మూక్‌(మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్స్‌), స్వయం వేదికలను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు ఓయూలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, పర్యావరణ శాస్త్రం కోర్సులో ఒక విద్యార్థి చేరితే.. ఇక్కడ పర్యావరణ శాస్త్రం కోర్సు మెటీరియల్‌, ఆచార్యులు లేకపోతే.. ఆ కోర్సును దిల్లీ వర్సిటీ నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. రాష్ట్రంలోనే తొలిసారిగా 2022-23 విద్యా సంవత్సరం నుంచి బీఏ(హానర్స్‌) హిస్టరీ కోర్సు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ సిటీ కళాశాలలో 60 సీట్లతో ఈ కోర్సు ప్రారంభం కానుంది.


అడ్డుగోడలు తొలగిస్తున్నాం

- ప్రొ.ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌

చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు అడ్డుగోడలు తొలగించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఒక విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థి మరో వర్సిటీ నుంచి ఏదైనా ఒక సబ్జెక్టు చదువుకునే వీలు కల్పిస్తున్నాం. 40 శాతం క్రెడిట్స్‌ ఇతర వర్సిటీల నుంచైనా చేసుకోవచ్చని యూజీసీ సైతం చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని