డ్రైవర్‌ పోస్టులకు పట్టభద్రులు.. కానిస్టేబుల్‌ కొలువులకు పోస్టు గ్రాడ్యుయేట్లు సై!

డ్రైవర్‌ పోస్టులకు అర్హత ఐటీఐ అయినా.. పట్టభద్రులూ దరఖాస్తు చేశారు.. ఇంటర్‌ విద్యార్హతతో చేపట్టే కానిస్టేబుల్‌ కొలువులకు పోస్టుగ్రాడ్యుయేట్లూ సై అంటున్నారు..

Updated : 30 May 2022 09:33 IST

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రాథమిక పరిశీలనలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: డ్రైవర్‌ పోస్టులకు అర్హత ఐటీఐ అయినా.. పట్టభద్రులూ దరఖాస్తు చేశారు.. ఇంటర్‌ విద్యార్హతతో చేపట్టే కానిస్టేబుల్‌ కొలువులకు పోస్టుగ్రాడ్యుయేట్లూ సై అంటున్నారు.. ఎస్సై ఉద్యోగాలకైతే ఎంటెక్, ఎంఫిల్‌ తదితర విద్యాధికులూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు.. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)లో నమోదైన దరఖాస్తుల్లో విశేషాలివి. పోలీసు, ఆబ్కారీ, ఆగ్నిమాపక, రవాణా శాఖల్లోని 17,516 యూనిఫాం పోస్టులకు 12,91,006 దరఖాస్తులొచ్చాయి. అభ్యర్థుల విద్యార్హతలపై మండలి జరిపిన ప్రాథమిక పరిశీలనలో ఆసక్తికర అంశాలెన్నో వెలుగుచూశాయి. 

ఎస్సై పోస్టులకు..

* సివిల్‌ లేదా అందుకు సమానమైన పోస్టుల విభాగంలో 2,16,738 మంది గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేషన్‌ సమాన అర్హత కలిగిన 2,985 మంది, పీజీ చేసిన 2,7266 మంది, 568 మంది మరిన్ని విద్యార్హతలున్నవారు దరఖాస్తు చేశారు.

* ఐటీ కమ్యూనికేషన్‌ విభాగంలో టెక్నికల్‌ డిగ్రీ పట్టా కలిగిన 12,433 మంది, 1290 మంది విద్యాధికులు పోటీ పడుతున్నారు.

* పోలీసు రవాణా సంస్థలో ఉద్యోగం కోసం సంబంధిత సాంకేతిక విభాగంలో డిప్లొమా చేసిన 1,290 మంది పోటీ పడుతుండగా.. 2,231 మంది విద్యాధికులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

* ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోలో ఏఎస్సై పోస్టుల కోసం సంబంధిత సాంకేతిక విభాగంలో డిగ్రీ చదివిన 4,943 మంది.. అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన 1,046 మంది దరఖాస్తు చేశారు.

కానిస్టేబుల్‌ పోస్టులకు..

* ఐటీ కమ్యూనికేషన్‌ విభాగంలో పోస్టులకు సంబంధిత అంశాల్లో ఐటీఐ చదివిన 6,668 మంది, ఒకేషనల్‌ ఇంటర్‌ చదివిన 1,457 మంది దరఖాస్తు చేశారు. 13,837 మంది విద్యాధికులు పోటీ పడుతుండటం విశేషం.

* మెకానిక్‌ విభాగంలో ఐటీఐ చేసిన 3,691 మంది, అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన 1,527 మంది పోటీ పడుతున్నారు. ఈ విభాగంలో 10 దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు.

* డ్రైవర్‌ పోస్టులకు ఐటీఐ చేసిన 3,034 మంది, ఇంటర్‌ చదివిన 19,170 మంది, అధిక విద్యార్హత కలిగిన 4,791 మంది దరఖాస్తు చేశారు.

* అగ్నిమాపక శాఖ డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుల కోసం హెచ్‌ఎంవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండటంతోపాటు ఐటీఐ చదివిన 1,282 మంది, ఇంటర్‌ పూర్తయిన 7,415 మంది, అధిక విద్యార్హత కలిగిన 2,237 మంది దరఖాస్తు చేశారు. 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts