బాసర.. ఇదేనా బాసట

కార్పొరేట్‌ విద్యాసంస్థలను తలదన్నేలా..గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిందే రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ, బాసర).కొన్నేళ్లుగా నిర్వహణ లోపంతో సమస్యలు

Updated : 19 Jun 2022 07:11 IST

సాంకేతిక విద్య.. సవాలక్ష సమస్యలు

ప్రొఫెసర్‌ ఒక్కరూ లేరు.. సహాయకులతో సాహసం

నిర్వహణ లేక వసతి గృహాల్లో దుర్గంధం 

ఎనిమిది వేల మంది విద్యార్థులున్న ఆర్జీయూకేటీ తీరు ఇది

ఈనాడు-హైదరాబాద్‌, ఈటీవీ-ఆదిలాబాద్‌, బాసర-న్యూస్‌టుడే: కార్పొరేట్‌ విద్యాసంస్థలను తలదన్నేలా..గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిందే రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ, బాసర).కొన్నేళ్లుగా నిర్వహణ లోపంతో సమస్యలు చుట్టుముట్టాయి. బోధన, వసతి పరంగా వెనుకబడటంతో విద్యాలయ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతోంది. ఎనిమిదివేల మంది విద్యార్థుల భవితకు ఇబ్బంది కలుగుతోంది. ప్రతి బ్రాంచ్‌కు నేతృత్వం వహించే ప్రొఫెసర్లు లేరు. వారికి అనుబంధంగా ఉండాల్సిన అసోసియేట్లు లేరు. చివరికి ఈ సంస్థ అంతా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లపై ఆధారపడి నడుస్తోంది. అందునా ఒప్పంద పద్ధతిలో నియామకమైన వారితో కొనసాగుతోంది. కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కో సమస్య వెలుగులోకి వస్తోంది.

* 2008లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మూడు ఆర్జీయూకేటీల్లో బాసర ఒకటి. మొదట మూడింటికి కలిపి ఒక ఉపకులపతి, రిజిస్ట్రారును నియమించారు. ప్రతి ప్రాంగణానికి ఒక డైరెక్టర్‌ ఉంటారు. రాష్ట్ర విభజన అనంతరం ఉపకులపతిని నియమిస్తూ వస్తున్నారు. 2018 నుంచి ఉపకులపతి పోస్టును ఐఏఎస్‌ అధికారులకు అదనపు బాధ్యతలతో అప్పగిస్తున్నారు. అప్పటి నుంచి నిర్వహణ లోపంతో విద్యాలయ ప్రభ తగ్గిపోతూ వస్తోంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు, నాలుగేళ్ల్ల బీటెక్‌ కోర్సులను ఈ విద్యాలయం అందిస్తోంది. ఏటా 1500 మంది కొత్త విద్యార్థులు అడుగుపెడుతున్నారు.

* విద్యార్థి-అధ్యాపక నిష్పత్తి ఇక్కడ పాటించటం లేదు. విద్యాలయంలో ప్రస్తుతం 20 మంది శాశ్వత, 134 మంది ఒప్పంద, 60 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీ అందుబాటులో ఉంది. విద్యాలయంలోని 8వేల మంది విద్యార్థులకు 214 మంది అధ్యాపకులు బోధిస్తున్నారు.

* గతేడాది నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (నాక్‌) ఇచ్చిన ర్యాంకుల్లో ఆర్జీయూకేటీకి ‘సి’ గ్రేడు రావడం విద్యార్థులను కలచివేస్తోంది. దీంతో ప్రాంగణ నియామకాలు తగ్గిపోయాయని ఆందోళన చెందుతున్నారు.

నిర్వహణకు నిధులు పూజ్యం

విద్యా సంస్థ నిర్వహణకు ఏటా కనీసం రూ.60 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. మూడేళ్లుగా బడ్జెట్‌లో రూ.20కోట్ల చొప్పున నిధులను ప్రకటిస్తున్నా విడుదలవుతోంది రూ.10కోట్లకు మించటం లేదు. బోధన రుసుం చెల్లింపులు ఏళ్లతరబడి నిలిచిపోయాయి.

* ఒక్కొక్క విద్యార్థికి రోజుకు రూ.90 చొప్పున మెస్‌ఛార్జీ చెల్లించాలి. వంటచేసే గుత్తేదారులకు ఈ లెక్కన పక్షం రోజులకోమారు బిల్లులు మంజూరు చేయాల్సి ఉండగా రెండు నెలలకు ఒకసారి కూడా విడుదల కావడం లేదు. ఆహారం పంపిణీలోనూ నాణ్యతా లోపాలున్నట్లు ఆరోపణలున్నాయి. 

* ప్రతి విద్యా సంవత్సరం కొత్తగా వచ్చే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించాలి.2018నుంచి ఇవ్వడం లేదు.

* బూట్లు, బెడ్‌షీట్లు, టవళ్లు, దిండు కవర్లు, పరుపుల పంపిణీ కూడా నిలిచిపోయింది. అయిదేళ్లుగా విరిగిపోయిన మంచాలు, చిరిగిపోయిన పరుపులతో నెట్టుకొస్తున్నారు.

* పదేళ్ల కాలానికి తాత్కాలికంగా 2008లో నిర్మించిన రేకుల షెడ్లలో కొన్ని సెక్షన్లకు ఇంటర్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. చాలా భవనాల సీలింగ్‌ పైకప్పులు విరిగి పడుతున్నాయి. రేకులు ధ్వంసమయ్యాయి. 

* వసతి గృహాల్లో డ్రైనేజీ పైపులు చాలాచోట్ల పగిలిపోయాయి. లీకవుతున్న మురుగుతో దుర్గంధం నడుమ విద్యార్థులు సతమతమవుతున్నారు.

* తరగతులు, వసతిగృహాల గదులు, కిటికీల తలుపులు, అద్దాలు పగిలిపోయాయి. మరుగుదొడ్ల తలుపులు ఊడిపోగా, చాలా చోట్ల వినియోగించలేని స్థితిలో ఉన్నాయి.

* కొన్నిచోట్ల విద్యుత్తు బోర్డులు, లైట్లు ధ్వంసమయ్యాయి. తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. 


నిర్వహణ లోపాలతో సమస్యలు

- సత్యనారాయణ, మాజీ ఇన్‌ఛార్జి వీసీ, బాసర ఆర్జీయూకేటీ

విద్యాలయంలోనే ఉండి బాధ్యతలు కొనసాగిస్తే బాసర ఆర్జీయూకేటీలో నిర్వహణ లోపాలను సరిదిద్దవచ్చు. 2018కి ముందు పలు ప్రాంతాల నుంచి ఆచార్యులు, మెంటార్లను తీసుకొచ్చాం. కనీసం 300 మందికిపైగా బోధన సిబ్బంది ఉండేవారు. అనంతర కాలంలో రోస్టర్‌ ఇబ్బందులు, కోర్టు సమస్యలు కూడా వచ్చాయి. నియామకాలపై స్పష్టత కరవైంది. విద్యాలయ ఏర్పాటుకు సంబంధించిన చట్టంలోనూ స్పష్టత లేదు. దీని సవరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని