Telangana News: రుణం చెల్లించలేదని బ్యానర్‌.. మనస్తాపంతో ఊరొదిలి వెళ్లిన రైతు

రుణ బకాయిల వసూలుకు డీసీసీబీ అధికారులు వ్యవహరించిన తీరుతో రైతు మనస్తాపం చెంది ఊరొదిలి వెళ్లారు.  భూమిని వేలం వేస్తామంటూ స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు నోటీసు అంటించడంతో పాటు.. బ్యానర్‌ కట్టారు.

Updated : 20 Jun 2022 08:06 IST

జోగిపేట, న్యూస్‌టుడే: రుణ బకాయిల వసూలుకు డీసీసీబీ అధికారులు వ్యవహరించిన తీరుతో రైతు మనస్తాపం చెంది ఊరొదిలి వెళ్లారు.  భూమిని వేలం వేస్తామంటూ స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు నోటీసు అంటించడంతో పాటు.. బ్యానర్‌ కట్టారు. అధికారుల చర్యల వల్ల గ్రామంలో అప్పు పుట్టే పరిస్థితి లేదని ఆందోళన చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కన్‌సానిపల్లి గ్రామంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. కన్‌సానిపల్లికి చెందిన శంకర్‌రెడ్డికి స్థానికంగా 3.31 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించి 2012-13లో జోగిపేట పట్టణంలోని డీసీసీబీ శాఖలో రూ.60వేల పంట రుణం తీసుకున్నారు. పంటలు సరిగా పండకపోవడంతో రుణాన్ని తిరిగి చెల్లించలేదు. ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. దానిపై ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్ల క్రితం బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో రూ.40వేలు చెల్లించారు. మిగతావి రద్దవుతాయని భావిస్తున్నారు. ఈ ఏడాది డీసీసీబీ అధికారులు వడ్డీతో కలిపి రుణం మొత్తం రూ.79,641 చెల్లించాలని పలుసార్లు తాఖీదులు పంపారు. ఈ నెల 23న వ్యవసాయ భూమిని వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. పంచాయతీ కార్యాలయం వద్ద వేలానికి సంబంధించిన నోటీసు అంటించడంతోపాటు.. ఇందుకు సంబంధించిన బ్యానర్‌ కట్టారు. దాన్ని అవమానంగా భావించిన శంకర్‌రెడ్డి 2 రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి గ్రామం విడిచి ఇస్నాపూర్‌కు వెళ్లారు. ఇదే విషయంపై శంకర్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. డీసీసీబీ అధికారుల వల్ల గ్రామంలో అప్పు పుట్టే పరిస్థితి లేదన్నారు. అందుకే బతుకు దెరువుకు ఫ్యాక్టరీలో పనిచేసేందుకు ఇస్నాపూర్‌కు వచ్చానని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని